విశాఖపట్నం ఐఐఎంలో జరిగిన 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రాంతీయ సదస్సులో ఎంవోయూల మార్పిడి

విశాఖపట్నం, అక్టోబర్ 7 (ఎక్స్‌ప్రెస్ టుడే): ఎన్ని అవరోధాలు వచ్చినా ప్రధాని మోదీ నాయకత్వంలో 7.8 వృద్ధి రేటుతో భారత దేశం ఎదుగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. బుధవారం విశాఖపట్నం ఐఐఎంలో 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రాంతీయ సదస్సుకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల ఆలోచనలు, నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో వేగంగా పయనిస్తోందన్నారు. ఈ అభివృద్ధి ప్రయాణంలో ప్రధాన ఇంగ్రీడియంట్‌గా నారా లోకేష్ మారారని పేర్కొన్నారు.

“టైమే ఇప్పుడు పెట్టుబడి” అని రామ్మోహన్ నాయుడు అన్నారు. పెట్టుబడిదారులకు ప్రాజెక్టులను వేగంగా ప్రారంభించడమే కీలకమని, ఏపీఐఐసీ సింగిల్ విండో మెకానిజం ద్వారా 6 నుంచి 12 నెలల్లో అనుమతుల ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. దీంతో పెట్టుబడిదారులు రాష్ట్రంలో వేగంగా పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. విశాఖపట్నం గేట్‌వే ఆఫ్ ఎకానమీగా దేశంలో గుర్తింపు పొందుతోందని, అన్ని రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ఆలోచన ఎంతో గొప్పదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విజయ ప్రస్థానంలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి అన్నారు. కేవలం 31 నెలల్లో విమానాశ్రయ నిర్మాణం పూర్తవడం, నిర్ణీత గడువుకు ఆరు నెలల ముందుగానే ప్రాజెక్టు పూర్తిచేయడం రాష్ట్రంలో ప్రాజెక్టుల అమలులో ఉన్న వేగానికి నిదర్శనమన్నారు.

కేంద్రం, రాష్ట్రం మధ్య మ్యూచువల్ రెస్పెక్ట్‌తో బంధం మరింత బలపడిందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన ఆలోచనలతో దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్రానికి రైల్వే జోన్ రావడం కూడా కీలక పరిణామమని పేర్కొన్నారు.

అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు నిర్మితమవుతున్న బుల్లెట్ ట్రైన్ ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే అవకాశం ఉండటం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. విమానాశ్రయాలు కేవలం కనెక్టివిటీని మాత్రమే అందించడం లేదని, ఆయా ప్రాంతాలను మినీ ఎకనామిక్ సిటీలుగా మార్చుతున్నాయని చెప్పారు. విమానాశ్రయాల రాకతో కార్గో, వ్యవసాయం, పర్యాటకం, రవాణా, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు సైట్ క్లియరెన్స్ లభించడం శుభపరిణామమని తెలిపారు. ఈ విమానయాన రంగానికి అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దే దిశగా 5,000 మంది ఏవియేషన్ ప్రొఫెషనల్స్‌ను తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.

ఏపీకి రూ.8.67 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు

గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 216 మెగా ప్రాజెక్టుల ద్వారా రూ.8.67 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2023–24లో 92 మిలియన్ డాలర్ల నుంచి 2025–26లో 608 మిలియన్ డాలర్లకు పెరిగాయని చెప్పారు.

గూగుల్, ఆర్సెలర్ మిట్టల్–నిప్పాన్ స్టీల్, ఎన్‌టీపీసీ, టాటా పవర్, రిలయన్స్ వంటి ప్రపంచస్థాయి సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులకు ముందుకు రావడం రాష్ట్రంపై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమన్నారు.

విమానయాన రంగంలో కొత్త శకం

కర్నూలులో దేశంలో తొలి డ్రోన్ సిటీ రూపుదిద్దుకుంటోందని, పుట్టపర్తిలో ఏరోస్పేస్, డిఫెన్స్ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని తెలిపారు. కర్నూలులో రాష్ట్ర తొలి FTO ప్రారంభించామని, మరో ఐదు FTOలు పైప్‌లైన్‌లో ఉన్నాయని చెప్పారు. కుప్పంలో దేశంలో తొలి హంస ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఏర్పాటవుతోందని వివరించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భారత్ 7.8 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతోందని, ఇబ్బందులను అవకాశాలుగా మార్చుకుని దేశం అద్భుతాలను సృష్టిస్తోందని రామ్మోహన్ నాయుడు అన్నారు.

ప్రపంచ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన స్వర్ణాంధ్ర విజన్‌లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. “ఈ దశాబ్దం భారతదేశానిది. ఇబ్బందులను అవకాశాలుగా మార్చుకుని అద్భుతాలు సృష్టిస్తున్నాం. వేగాన్ని ఎంచుకోండి.. ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకోండి” అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.

వివిధ సంస్థలతో కుదుర్చుకున్న 31 ఎంవోయూలను కేంద్ర మంత్రి సమక్షంలో మార్చుకున్నారు. స్టాల్స్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి వాటిని సందర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, టీజీ భరత్, ఎంపీలు మతుకుమిల్లి శ్రీ భరత్, కలిసెట్టి అప్పలనాయుడు, సీఐఐ అధికారులు, ఐఐఎం అధికారులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కలెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.