విశాఖపట్నం, నవంబర్ 1 (ఎక్స్‌ప్రెస్ టుడే): విశాఖపట్నం నగరంలో జీవీఎంసీ రెండో సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలోని సివిల్ ఇంజనీరింగ్ కాంప్లెక్స్ భవనంలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌లతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్నికల వివరాలను వెల్లడించారు.
జీవీఎంసీ పరిధిలోని 120 వార్డుల్లో మొత్తం 18,37,901 మంది ఓటర్లకు గాను 9,45,915 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, మొత్తం 51.47 శాతం పోలింగ్ నమోదైందని స్పష్టం చేశారు. వీరిలో 4,55,395 మంది పురుషులు, 4,90,519 మంది మహిళలు ఓటు వేశారని వివరించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించామని, సాయంత్రం 5 గంటలకు క్యూలైన్లలో ఉన్న ఓటర్లందరికీ టోకెన్లు అందించి ఓటు వేసే అవకాశం కల్పించామన్నారు. దీంతో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 7 గంటల నుంచి 7.15 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగిందన్నారు.
మొత్తం 1,990 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని, నగరవ్యాప్తంగా ఎలాంటి ఎన్నికల సంబంధిత ఫిర్యాదులు లేదా ఘటనలు నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో సుమారు 15 వేల మంది సిబ్బంది పాల్గొన్నారని, 201 రూట్లలో పోలింగ్ సిబ్బంది, ఎన్నికల సామగ్రి తరలింపునకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం పోలింగ్ బృందాలు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి చేరుకుని, బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని కేటాయించిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచే ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు.
ఇటీవల తుపాను ప్రభావంతో జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ, పోలీస్ శాఖలు సహాయక, పునరావాస కార్యక్రమాల్లో నిమగ్నమైనప్పటికీ ఎన్నికల విధులను సమన్వయంతో నిర్వహించామన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన 15 వేల మంది సిబ్బంది, పోలీస్ యంత్రాంగం, ఓటర్లు, మీడియా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
నవంబర్ 3వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన 113 కౌంటింగ్ హాళ్లలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకోసం 1,507 కౌంటింగ్ టేబుళ్లు, సుమారు 5,000 మంది సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. గరిష్టంగా రెండు రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రతి కౌంటింగ్ హాల్లో ఒకవైపు మేయర్ పదవికి సంబంధించిన బ్యాలెట్ పత్రాలు, మరోవైపు వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాల లెక్కింపు చేపడతామన్నారు. ఉదయం 7 గంటలకు అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూములు తెరిచి, కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని వివరించారు. పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించిన విధంగానే ఓట్ల లెక్కింపును కూడా పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
