విశాఖపట్నం, అక్టోబర్ 23: జీవీఎంసీ రెండో సాధారణ ఎన్నికలు–2026 నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన సిటీ ఆపరేషన్స్ సెంటర్ (సీవోసీ)లో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. అభిషిక్త్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి కేతన్ గార్గ్, అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మతో కలిసి శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల నుంచి సమాచారం సేకరణ, వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణ, ఫిర్యాదుల స్వీకరణ, వాటిపై తీసుకునే చర్యల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించాలని, ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి సకాలంలో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
పోలింగ్ రోజున ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని సేకరించి, క్రోడీకరించి నివేదికలు రూపొందించాలని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి నిర్ణీత సమయాల్లో కచ్చితమైన సమాచారం అందేలా ఎన్నికల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అలాగే, ఎన్నికలకు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు, ఫిర్యాదులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై నిరంతర నిఘా ఉంచాలని, అభ్యంతరకరమైన పోస్టులు లేదా నిబంధనలకు విరుద్ధమైన ప్రచారం గుర్తించినప్పుడు నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
