విశాఖపట్నం, అక్టోబరు 17 (ఎక్స్‌ప్రెస్ టుడే): ఎం.పి.టి.సి, జెడ్.పి.టి.సి ఎన్నికల విధులను నిబద్ధతతో నిర్వహించాలని, ఎన్నికలకు సంబంధించిన ప్రతి పనిలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలనే పాటించాలని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులకు ఆదేశించారు. ప్రతి ఒక్కరూ నిబంధనావళిని క్షుణ్ణంగా చదువుకుని వారికి కేటాయించిన విధులను నిర్వర్తించాలన్నారు.
శనివారం నగర పోలీస్ కమిషనర్‌తో కలిసి కలెక్టర్ పరిషత్తు ఎన్నికల ఏర్పాట్లపై నోడల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 19న వెలువడుతుందని, 4 జడ్పీటీసీ, 53 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ఈ నెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఉంటుందని, ఎన్నికలు నవంబర్ 3న, ఓట్ల లెక్కింపు 5వ తేదీన జరుగుతాయని కలెక్టర్ తెలిపారు.
ఎన్నికలు సజావుగా నిర్వహించుటకు గానూ నోడల్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. డివిజనల్ స్థాయిలో ఆర్.డి.ఓలు ఇన్‌చార్జ్‌లుగా ఉంటారని, అసిస్టెంట్ అథారిటీగా ఎం.పి.డి.ఓలు వ్యవహరిస్తారని తెలిపారు. 203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడమైందని, ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కనీస వసతులు ఉండేలా చూడాలని సూచించారు.
మోడల్ కోడ్ వెంటనే అమలులోకి వస్తుందని, పార్టీల ప్రతినిధుల ఫోటోలు, ఫ్లెక్సీలు తొలగించాలని, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయాలని తెలిపారు. మోడల్ కోడ్ అమలు బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల సామాగ్రిని సమకూర్చుకోవాలని, పోలింగ్ అధికారులకు, సిబ్బందికి శిక్షణలు పూర్తి చేయాలని తెలిపారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, ఇతర ఎన్నికల సామాగ్రిని ఆయా నోడల్ అధికారులు సమకూర్చుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ అధికారులు చూడాలన్నారు.
నగర కమిషనర్ శంఖబ్రత్ భాగ్జి మాట్లాడుతూ 203 పోలింగ్ స్టేషన్ల కోసం 6607 మందిని పోలీస్ శాఖ నుండి బందోబస్తు కోసం నియమించడం జరిగిందన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ల ద్వారా కూడా పటిష్టమైన ఏర్పాట్లను చేస్తున్నట్లు పేర్కొన్నారు.
