విశాఖపట్నంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో జరిగిన ‘సేవా జ్యోతి’ ర్యాలీ
విశాఖపట్నం, అక్టోబర్ 7 (ఎక్స్‌ప్రెస్ టుడే): భారత ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు అధ్యక్షతన యువమోర్చా ఆధ్వర్యంలో ‘సేవా జ్యోతి’ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు.
నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదగడం, దేశ కీర్తి ప్రపంచవ్యాప్తంగా మరింతగా పెరగడం ఎంతో గర్వకారణమని ముఖ్య అతిథి అన్నారు.
మూడు దశాబ్దాలకు పైగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కలగా ఉన్న రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ‘సౌత్ కోస్ట్ రైల్వే జోన్’గా రావడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. ఒకప్పుడు అసాధ్యమని భావించిన రైల్వే జోన్‌ను సాకారం చేయడం నరేంద్ర మోదీ నాయకత్వానికి నిదర్శనమన్నారు. దీని ద్వారా విశాఖతో పాటు ఉత్తరాంధ్ర, మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు మరింత పెరగనున్నాయని తెలిపారు.
నరేంద్ర మోదీ సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ను అందించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.
