విశాఖపట్నం, అక్టోబర్ 25 (ఎక్స్ప్రెస్ టుడే): బంగాళాఖాతం తూర్పు–మధ్య, ఆగ్నేయ ప్రాంతాల్లోని వాయుగుండం అక్టోబర్ 28 నాటికి అతి తీవ్ర తుపానుగా మారి, బాపట్ల–విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
ఐఎండీ అంచనా ప్రకారం, పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ ఈ వ్యవస్థ 26వ తేదీ ఉదయానికి తుపానుగా, 27వ తేదీ ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. 28వ తేదీ ఉదయం నాటికి అతి తీవ్ర తుపానుగా ఆంధ్రప్రదేశ్ తీరం సమీపానికి చేరుతుంది. తీరం దాటే సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
రాష్ట్రంలోని కోస్తా ప్రాంతంలో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మరోవైపు, ఈ తుపాను నేపథ్యంలో పొరుగున ఉన్న ఒడిశా ప్రభుత్వం విపత్తు సన్నద్ధతను చేపట్టినట్లు ప్రకటించింది.
