ఆరిలోవ, అక్టోబర్ 14 (ఎక్స్‌ప్రెస్ టుడే): ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కైలాసగిరిపై పోలీస్ ఔట్‌పోస్ట్‌ను నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిసి ప్రారంభించారు.

గ్లాస్ బ్రిడ్జ్, రోప్‌వే, శివపార్వతుల విగ్రహం, 65 అడుగుల త్రిశూలం, డమరుకం వంటి అనేక ఆకర్షణీయమైన సందర్శనా ప్రాంతాలు కలిగిన కైలాసగిరిపై పర్యాటకుల భద్రత కోసం ఈ ఔట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు.

ఈ ప్రాంతాల్లో ఆకతాయిల ఆగడాలకు, పర్యాటక ప్రాంతాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా నిరంతరం పోలీసింగ్ ఉండేలా చూడటమే ఔట్‌పోస్ట్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. అత్యవసర సమయాల్లో పోలీసు సేవలు అందుబాటులో ఉండేలా ఔట్‌పోస్ట్‌లో తగిన సిబ్బందిని ఉంచినట్టు వెల్లడించారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీపీతో పాటు డీసీపీ-1 (ఎల్ అండ్ ఓ) వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపీఎస్, ఏసీపీ (ద్వారకా), ఏసీపీ (ట్రాఫిక్), ఆరిలోవ సీఐ (ఎల్ అండ్ ఓ), ఆరిలోవ సీఐ (ట్రాఫిక్), ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.