విజయవాడ, అక్టోబర్ 31 (ఎక్స్‌ప్రెస్ టుడే): ఒక భాషలోని సాహిత్యాన్ని మరో భాషలోకి అనువదించేటప్పుడు మూల రచయిత భావాన్ని, అంతరార్థాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అనువాదం అనేది కేవలం పదాలను మరో భాషలోకి మార్చడం కాదని, కవి హృదయంలోని భావాన్ని, ఆలోచనలను, అనుభూతులను పాఠకులకు అందించడమని పేర్కొన్నారు. సరళమైన భాషలో గొప్ప సాహిత్యాన్ని అందించడమే మంచి అనువాదకుడి లక్షణమని అభిప్రాయపడ్డారు.
విజయవాడ గవర్నర్‌పేటలోని సీవీఆర్జీఎం హైస్కూల్ ప్రాంగణంలో శనివారం సాయంత్రం ఎమెస్కో పబ్లిషర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పి. కృష్ణయ్య అనువదించిన రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వవిఖ్యాత రచన ‘గీతాంజలి’ తెలుగు గ్రంథాన్ని జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించుకున్న గీతాంజలి వంటి రచనను మరో భాషలోకి తీసుకురావడం సాధారణ విషయం కాదన్నారు. ముఖ్యంగా కవిత్వంలో ప్రతి పదానికి ఒక ప్రత్యేకమైన భావం, లోతైన అనుభూతి ఉంటుందని, వాటిని అర్థం చేసుకోకుండా చేసే అనువాదం మూల రచనకు న్యాయం చేయలేదని పేర్కొన్నారు. అనువాదకుడు ముందుగా కవి ఆలోచనా ప్రపంచంలోకి వెళ్లి, ఆయన వ్యక్తీకరించిన భావాలను ఆకళింపు చేసుకోవాలని సూచించారు. కృష్ణయ్య ఈ విషయంలో సఫలీకృతులు అయ్యారని చెప్పారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల ప్రాధాన్యాన్ని వివరించారు. తెలుగు భాషాభివృద్ధికి ఇటువంటి పుస్తకాలు, సాహిత్య కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
డాక్టర్ పి. కృష్ణయ్య రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలిని తెలుగులోకి అనువదిస్తూ మూల రచనలోని భావసంపదను తెలుగు పాఠకులకు చేరువ చేసే ప్రయత్నం చేశారు. అనువాదంలో సరళమైన భాషకు ప్రాధాన్యమిస్తూ సాహిత్య విలువలు, కవితాత్మకత దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాష, సాహిత్య పరిరక్షణకు అనువాద రచనలు ఎంతో అవసరమని అన్నారు. ప్రపంచ ప్రసిద్ధ రచనలను మాతృభాషలో అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ సాహిత్యం సమాజానికి ఆలోచనను, విజ్ఞానాన్ని అందించే శక్తివంతమైన సాధనమని తెలిపారు. ఇటువంటి గ్రంథాలు భావితరాలకు సాహిత్య వారసత్వాన్ని పరిచయం చేస్తాయని అన్నారు.
ఎమెస్కో పబ్లిషర్స్ అధినేత విజయకుమార్ మాట్లాడుతూ నాణ్యమైన సాహిత్య గ్రంథాలను పాఠకులకు అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రచురణ సంస్థ లక్ష్యమని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత సాహిత్య రచనలను తెలుగు పాఠకులకు పరిచయం చేయడంలో ప్రచురణ సంస్థ కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాహిత్యాభిమానులు, విద్యావేత్తలు, ప్రముఖులు పాల్గొన్నారు.
