తిరుమల, అక్టోబరు 26: భారత ఉప రాష్ట్రపతి గౌరవ శ్రీ సి.పి. రాధాకృష్ణన్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ముందుగా క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉప రాష్ట్రపతి శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు.

అనంతరం శ్రీవారి ఆలయం వద్దకు ఉప రాష్ట్రపతి చేరుకోగానే టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణలు ఆయనను సాదరంగా ఆహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.

తరువాత ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అటు పిమ్మట శ్రీ వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.

అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. భారత ఉపరాష్ట్రపతికి టీటీడీ ఈవో, అదనపు ఈవో స్వామి వారి చిత్ర పటాన్ని, తీర్థప్రసాదాలను అందించారు.

ఉప రాష్ట్రపతి శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి వారిని కూడా అనంతరం దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖుల్లో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి శ్రీ అనగాని సత్య ప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ రామ్మూర్తి, శ్రీ దివాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, పలువురు రాష్ట్రస్థాయి మరియు జిల్లాస్థాయి అధికారులు ఉన్నారు.