వైయస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన గుండ లక్ష్మీదేవి, ముఖ్య అనుచరులు

నాలుగు దశాబ్దాల టీడీపీ అనుబంధానికి స్వస్తి పలికి వైఎస్సార్‌సీపీలో చేరిక

తాడేపల్లి, అక్టోబర్ 22: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సమక్షంలో శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఆమె ముఖ్య అనుచరులు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

గుండ లక్ష్మీదేవి కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుబంధం ఉంది. ఆమె భర్త, దివంగత మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. గుండ లక్ష్మీదేవి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

గుండ లక్ష్మీదేవితో పాటు టీడీపీ నాయకులు ముద్దాడ ప్రవీణ్, జల్లు రాజీవ్, సిమ్మ నర్సింగరావు, పల్లి శ్రీనివాసరావు, కునుకు గోవింద్, గాడు సాయికుమార్, గేదెల రాంకుమార్, యాగాటి ప్రసాద్, చిన్నాల ముత్తయి నాయుడు, చెట్టు గోవింద్, గురువు శ్రీనివాస్, రౌతు నాగేశ్వరరావు వైఎస్సార్‌సీపీలో చేరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.