స్వదేశ్ దర్శన్ 2.0 కింద అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి — రెండేళ్లలో పూర్తిచేస్తామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
అరసవల్లి, అక్టోబర్ 5 (ఎక్స్‌ప్రెస్ టుడే): శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయాన్ని స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద మంజూరైన రూ.55.74 కోట్లతో రానున్న రెండేళ్లలో సమగ్రంగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పర్యాటక శాఖ నుంచి నిధులు మంజూరు కావడం ఆనందంగా ఉందని, శ్రీకాకుళం జిల్లా ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సోమవారం అరసవల్లి ఆలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి, అర్చకుల వేద ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వదేశ్ దర్శన్ 2.0 కింద చేపట్టనున్న అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన మౌలిక వసతులు, భవిష్యత్ అవసరాలపై అధికారులతో చర్చించారు. గత రెండేళ్లుగా ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నామని, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించి మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా పనులు వేగంగా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు.
క్యూలైన్లు, కేశఖండన శాల ఆధునీకరణ
భవిష్యత్‌లో పెద్ద ఎత్తున భక్తులు అరసవల్లి ఆలయానికి వచ్చే అవకాశం ఉన్నందున, వారి అవసరాలకు అనుగుణంగా క్యూలైన్లు, కేశఖండన శాల తదితర సౌకర్యాలను ఆధునీకరించి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.4 కోట్లతో పుష్కరిణి అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. త్వరలో జరగనున్న రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. రానున్న రోజుల్లో దేశంలోని ప్రముఖ ఆలయాల సరసన అరసవల్లి ఆదిత్యుని ఆలయం నిలిచేలా అభివృద్ధి చేస్తామని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మరిన్ని నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
అరసవల్లి ఆలయ అభివృద్ధికి స్థానిక ప్రజలు అందిస్తున్న సహకారం మరువలేనిదని కేంద్ర మంత్రి అన్నారు. ప్రభుత్వం, ఆలయ అభివృద్ధిపై నమ్మకంతో స్థానికులు పూర్తి సహకారం అందిస్తున్నారని, అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనుకున్న మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ హరి ఓం పాండ్య, ఆర్డీవో సాయి ప్రత్యూష, మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్, ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
