(ఎక్స్‌ప్రెస్ టుడే): సర్వేపల్లి కట్టలో 22.31 ఎకరాల భూమిపై అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. సుమారు రూ.600 కోట్ల విలువైన ఆస్తిపై 939 కుటుంబాలకు శాశ్వత హక్కులు కల్పించారు.

మహిళా సాధికారతకు ప్రాధాన్యం

మొత్తం 939 మంది లబ్ధిదారుల్లో 701 మంది మహిళల పేరుతో పట్టాలు మంజూరు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సహా వివిధ వర్గాల అర్హులకు ఇళ్ల పట్టాలు అందజేశారు.

చట్టబద్ధమైన హక్కులు, డిజిటల్ భద్రత

భూమి పునర్వర్గీకరణతో చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తూ G.O.Ms.No.553 జారీతో పట్టాలు మంజూరు చేశారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, క్యూ ఆర్ కోడ్‌తో ఇళ్ల పట్టాలకు డిజిటల్ భద్రత కల్పించారు. భూ రికార్డుల పరిశీలన నుంచి పట్టాల మంజూరు వరకు పారదర్శక ప్రక్రియ చేపట్టారు.

గతంలో, రానున్న రోజుల్లో

గతేడాది భగత్ సింగ్ కాలనీలో 1,407 కుటుంబాలకు 36 ఎకరాల భూమికి పట్టాలు పంపిణీ చేశారు. జాఫర్ సాహెబ్ కెనాల్ ప్రాంతంలోనూ త్వరలో ఇళ్ల పట్టాల పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు.

పేదల సొంతింటి లక్ష్యం

పేదల ఆత్మగౌరవానికి భరోసా, కుటుంబ భద్రత లక్ష్యంగా ప్రభుత్వం సొంతింటి హక్కు కల్పిస్తోంది. ఇప్పటికే విశాఖ, విజయవాడ, మంగళగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా 60 వేల కుటుంబాలకు లబ్ది చేకూరింది.

2029 కల్లా రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి ఇళ్లు ఉండాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు ఉన్నారు. మొత్తం 19 లక్షల ఇళ్లు నిర్మించాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటికే 5.50 లక్షల ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించినట్లు ప్రభుత్వం తెలిపింది.