ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘానికి జరిగిన ఎన్నికల్లో బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోసారి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలో జరిగిన రాష్ట్ర సంఘం ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సీసీఎల్ఏ కార్యాలయంలో అడిషనల్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న చేబ్రోలు కృష్ణమూర్తి రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శిగా మూడోసారి ఎన్నికయ్యారు. విశాఖపట్నం జిల్లాలో కలెక్టర్ పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్న డి. రాజేంద్ర వర్మ రాష్ట్ర సంఘం స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి విశాఖపట్నం జిల్లా చైర్మన్ సత్తి నాగేశ్వరరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు ఎస్.ఏ. త్రినాథరావు, కార్యదర్శి పి. శ్యాం ప్రసాద్, కోశాధికారి జి. రాజేష్, పి. సుధీర్, యోగి, వి. వరుణ్, గౌతమ్ తదితరులు ఎన్నికైన రాష్ట్ర నాయకులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం మరింత సమర్థవంతంగా కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.
