బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, అక్టోబర్ 27 (ఎక్స్ప్రెస్ టుడే): రామచంద్రపురం పురపాలక సంఘం ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కార్మికశాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఛైర్పర్సన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావుకు వస్తున్న స్పందనను విజయతీరాలకు చేర్చేందుకు సుభాష్ కూటమి నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న తీరు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
అభ్యర్థి ఎంపిక నుంచి క్షేత్రస్థాయి ప్రచార వ్యవహారాల వరకు ప్రతి అంశాన్ని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్ళుతున్న మంత్రి సుభాష్ తీరుతో కూటమి నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో రామచంద్రపురం పురపాలక ఎన్నికల్లో కూటమి అభ్యర్థి శేషారావు గెలుపు దిశగా ముందడుగు వేస్తున్నారన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
రాజకీయాల్లో నాయకత్వం అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం కాదు. అందరినీ కలుపుకొని లక్ష్యం దిశగా నడిపించడంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇప్పటికే విజయం సాధించారు.
కాలుకు బలపం కట్టుకున్నట్టుగా మంత్రి సుభాష్ కూటమి అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశం శ్రమిస్తున్నారు. తాను శాసనసభ్యుడిగా పోటీ చేసిన సమయంలో కంటే మరింత రెట్టింపు ఉత్సాహంతో శేషారావు గెలుపు బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుని ఇంటింటి ప్రచారంలో బిజీగా ఉన్నారు.
అంతేకాక కూటమి నాయకుల మధ్య ఎలాంటి విభేదాలకు ఆస్కారం లేకుండా అన్ని సామాజిక వర్గాల వారిని స్వయంగా కలుస్తూ కూటమి విజయావకాశాలను మంత్రి సుభాష్ మార్గం సుగమం చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా ఏ ఎన్నికలోనైనా అభ్యర్థి బలంతో పాటు కూటమి పార్టీల మధ్య ఐక్యత, స్థానిక నాయకుల సహకారం, కార్యకర్తల శ్రమ కీలక పాత్ర పోషిస్తాయి, ముఖ్యంగా పురపాలక ఎన్నికల్లో వార్డుల వారీగా ప్రజలతో ఉన్న సంబంధాలు, స్థానిక సమస్యలపై అవగాహన వివిధ వర్గాల మద్దతు ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి వాసంశెట్టి సుభాష్ సమష్టి కృషికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఒకవైపు మంత్రి సుభాష్, ఆయన తండ్రి వాసంశెట్టి సత్యంల రాజకీయ అనుభవంతో శేషారావు గెలుపు నల్లేరు పై నడకేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మంత్రిగా రామచంద్రపురం పట్టణాన్ని అభివృద్ది చేయడం కూడా కూటమి అభ్యర్థికి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తున్నది. వాసంశెట్టి కుటుంబానికి ప్రజలతో అనుబంధం, అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారంలో చొరవ వల్ల కూటమి అభ్యర్థి విజయానికి పునాదులు అవుతాయని రాజకీయ పండితులు అంటున్నారు.
