రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు పీహెచ్సీలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లకు శాశ్వత భవనాలు కల్పించే పనులను ప్రభుత్వం వేగవంతం చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 1,231 పీహెచ్సీలు ఉండగా, ప్రస్తుతం 1,143 వాటికి సొంత భవనాలు ఉన్నాయని, కొత్తగా మంజూరైన 88 పీహెచ్సీ భవనాల్లో 13 పూర్తయ్యాయని మంత్రి వివరించారు. ఆర్అండ్బీ శాఖ ద్వారా చేపట్టిన 43 పనుల్లో 14 పూర్తికాగా, 29 నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 560 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉండగా, 175 ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయని, మరో 385 కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినట్టు తెలిపారు. వీటిలో 327 భవనాలను నిర్మించి అప్పగించగా, మరో 55 భవనాల నిర్మాణం కొనసాగుతోందని వివరించారు.
