న్యూఢిల్లీ, అక్టోబర్ 8 (ఎక్స్‌ప్రెస్ టుడే): సీఐఐ భాగస్వామ్య సదస్సు కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ఈ సదస్సులో ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

ఎంఓయూలను సాకారం చేసే అంశంపై ఎక్కువ ఫోకస్ పెట్టామని సీఎం పారిశ్రామికవేత్తలకు వెల్లడించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలను త్వరలో ప్రారంభించనున్నట్టు స్పష్టం చేశారు. "బిల్డ్ ఏపీ" నినాదంతో పనిచేస్తున్నామని ప్రకటించారు.

25 ఏళ్లుగా నిరంతరాయ ప్రజాసేవలో ఉన్న ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిజిటల్ ఇన్‌ఫ్రాను దేశంలోకి తీసుకురావడంలో ప్రధాని పాత్ర కీలకమని అన్నారు. అత్యద్భుతమైన రోడ్ నెట్‌వర్క్‌తో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని, రైల్వే నెట్‌వర్క్‌లోనూ దేశం కీలక స్థానంలో ఉందని చెప్పారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్వే, రోడ్ నెట్‌వర్క్ కలిగిన బలమైన దేశాన్ని, రక్షణపరంగా అత్యంత భద్రత ఉన్న దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడంలో ప్రధాని పాత్ర అత్యద్భుతమని పేర్కొన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందున్న భారతీయులు ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారని తెలిపారు.

ఏపీకి చేయూత ఇవ్వడంలో కేంద్రం, ప్రధాని మోదీ ముందున్నారని సీఎం అన్నారు. పోలవరం, అమరావతి రాజధాని ప్రాజెక్టులతో పాటు వేర్వేరు ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందిస్తున్నారని, విశాఖ సహా వివిధ ప్రాంతాల్లో సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందని చెప్పారు.

ఏపీలో సంపద సృష్టించడంతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనే లక్ష్యమని సీఎం తెలిపారు. గతేడాది నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రూ.13.50 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని, గడచిన 28 నెలల్లో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించగలిగామని వివరించారు. ఎంఓయూలకే పరిమితం కాకుండా వాటిని పెట్టుబడులుగా మలిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. గూగుల్ 1 గిగావాట్ డేటా సెంటర్, ఆర్సెలార్ మిత్తల్ వంటి ప్రముఖ కంపెనీలు ఏపీకి వచ్చాయని చెప్పారు.

గతేడాది ప్రకటించిన మేరకు పారిశ్రామిక ప్రోత్సాహకాలను నవంబరు 12, 13 తేదీల్లో ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు. పెట్టుబడులకు అడ్డంకిగా ఉన్న నాలా యాక్టును రద్దు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడే ఏ విధానాన్నైనా తక్షణం అమలు చేయడానికి ఏపీ సిద్ధంగా ఉందన్నారు.

గోదావరి, కృష్ణ, పెన్నా, తుంగభద్ర, కావేరి నదులు అనుసంధానమైతే ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు నీటి కొరత రాదని సీఎం అభిప్రాయపడ్డారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తయారు చేయాలని నిర్దేశించుకున్నామని, సౌత్ ఈస్ట్ ఏషియాకు గేట్‌వేగా ఏపీని మార్చడమే లక్ష్యమని చెప్పారు.

దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుకు మజగావ్ డాక్ యార్డ్ లిమిటెడ్ ముందుకు వచ్చిందని, మచిలీపట్నంలో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటుకు గోవా షిప్‌యార్డ్ సంస్థ అంగీకరించిందని సీఎం తెలిపారు. తిరుపతి, లేపాక్షి, కొప్పర్తిలో డ్రోన్, ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లను ఏర్పాటు చేశామని, 5వ తరం ఫైటర్ జెట్ ప్రాజెక్టును రక్షణ శాఖ రాయలసీమలో ప్రారంభించిందని చెప్పారు.

500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంలో ఇప్పటికే 110 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిపై ఒప్పందాలు కుదిరాయని, గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ కారిడార్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామని సీఎం వివరించారు.

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ఏఐ సహా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలుగా తయారు చేసేలా పాఠ్యాంశాలను రూపొందిస్తున్నామని తెలిపారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులను స్వయం బ్రాండ్ పేరుతో అంతర్జాతీయ మార్కెట్లకు ప్రమోట్ చేస్తామన్నారు. డేటా లేక్ వంటి వ్యవస్థల ద్వారా ఏఐ స్టాక్ లాంటి సాంకేతికతతో వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామని, జీఎస్టీ వసూళ్లలో ఏఐ స్టాక్ అమలుతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లోని అపార అవకాశాలను అందిపుచ్చుకునేలా "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" అమలు చేస్తున్నామన్నారు.

బ్లూ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉందని, అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఆపరేషన్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మొదలవుతాయని సీఎం తెలిపారు. అమరావతిలో గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్ ద్వారా వివిధ రంగాల్లో నాయకత్వాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. విశాఖ వంటి డెస్టినేషన్లకు చేరుకునేలా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిందని, బాపట్ల లాంటి అద్భుతమైన తీర ప్రాంతాలు ఏపీలో ఉన్నాయని చెప్పారు.

సీఐఐ భాగస్వామ్య సదస్సుల నిర్వహణ కోసం కేంద్రం అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం కోరారు.