కర్నూలు, అక్టోబర్ 22: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు నగరంలోని ఆయన కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ‘చెప్పాం.. చేస్తున్నాం’ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.

అనంతరం కర్నూలు నగరంలోని 19వ వార్డుకు చెందిన పలువురు నాయకులు వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి టీజీ భరత్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో షేక్ అన్వర్ భాష, షేక్ చాంద్ భాష, షేక్ అబ్బాస్ ఖాన్ తదితరులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని వారు తెలిపారు.

అదేవిధంగా కమేలా ప్రాంతంతో పాటు కర్నూలు నగరంలోని పలు వార్డులకు చెందిన ముస్లిం నాయకులు కూడా మంత్రి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థులను గెలిపిస్తే నగరంలో అభివృద్ధి పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. పనిచేసే వారికే ప్రజలు మద్దతు ఇవ్వాలని పేర్కొన్న మంత్రి, కులమతాలకు అతీతంగా కర్నూలు నగరంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి తాను కృషి చేస్తున్నానని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన, నగర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు కూటమి మేయర్ అభ్యర్థి విజయ ప్రత్యూష, కార్పొరేటర్ అభ్యర్థులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.