కర్నూలు, అక్టోబర్ 21: నగర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలోని 4, 5వ వార్డుల్లో కూటమి మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూషతో కలిసి మంత్రి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు.
ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. కర్నూలు, పాణ్యం నియోజకవర్గాల నుంచి వైసీపీకి మేయర్ అభ్యర్థి దొరకలేదా? అని ప్రశ్నించారు. వైసీపీ కార్పొరేటర్లు గెలిచినా చేసేదేమీ లేదని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీకి తెలుసని, ప్రజలకు మేలు చేయడం తెలియదని అన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, నగర ప్రగతికి అడ్డంకులు లేకుండా ముందుకు సాగాలంటే కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
కర్నూలు నగరంలో రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.
కూటమి అభ్యర్థులను గెలిపించడం ద్వారా నగర అభివృద్ధికి మరిన్ని అవకాశాలు కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆశీస్సులు, సహకారంతో కర్నూలును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ప్రచారంలో 4వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సుశీల భాయి, 5వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఉట్ల రమేష్ బాబు పాల్గొన్నారు.
