కర్నూలు, నవంబర్ 2 (ఎక్స్‌ప్రెస్ టుడే): వైద్య రంగంలో నర్సుల సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో నిర్వహించిన 79వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బైయెన్నియల్ కాన్ఫరెన్స్‌లో మంత్రి పాల్గొని నర్సింగ్ రంగంలో వస్తున్న మార్పులు, నర్సుల సేవల ప్రాధాన్యతపై మాట్లాడారు.

కరోనా సమయంలో ప్రజలంతా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇళ్లకే పరిమితమైనప్పటికీ, వైద్యులు, నర్సులు మాత్రం ప్రాణాలకు తెగించి రోగులకు సేవలందించారని మంత్రి గుర్తుచేశారు. నర్సులు చూపించే ఓర్పు, సహనం, ఆప్యాయత, సేవాభావం ఎంతో గొప్పవని కొనియాడారు.

కొన్ని ఆసుపత్రులకు అక్కడి నర్సులు అందించే నాణ్యమైన సేవలు, రోగుల పట్ల చూపించే ప్రత్యేక శ్రద్ధ కూడా మంచి గుర్తింపును తీసుకొస్తాయని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నర్సులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని, తమ నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ హెల్త్ వంటి సాంకేతికతలను వైద్య సేవల్లో సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, రోగుల పట్ల మానవీయ విలువలు, ఆప్యాయత, సేవాభావం అత్యంత ముఖ్యమని తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో వైద్య రంగ అభివృద్ధికి, నర్సింగ్ సేవల మెరుగుదలకు ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొస్తోందని మంత్రి తెలిపారు. నర్సుల నైపుణ్యాభివృద్ధికి ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు.

కర్నూలులో జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన వైద్య, నర్సింగ్ రంగ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలకు కర్నూలు వేదిక కావడం నగరానికి గర్వకారణమని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు డి. ఉషా పన్నగవేణి, ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అండ్ మిడ్‌వైవ్స్ కౌన్సిల్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. సుశీల, రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ నర్సింగ్ డాక్టర్ పి. హిమగిరి, కర్నూలు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్, ఆర్గనైజింగ్ చైర్‌పర్సన్ డాక్టర్ ఆర్. పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.