కర్నూలు, అక్టోబర్ 14 (ఎక్స్‌ప్రెస్ టుడే): హోళగుంద మండలం దేవరగట్టు గ్రామంలో నిర్వహించనున్న బన్ని ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు.

సుమారు 3 లక్షల నుంచి 5 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున భద్రత, వైద్య సేవలు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, రహదారులు, అత్యవసర సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని వారు సూచించారు.

కలెక్టర్ మాట్లాడుతూ, భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గతంలో ఉన్న 20 పడకల వైద్య సదుపాయాన్ని 30 పడకలకు పెంచాలని, అంబులెన్సుల సంఖ్యను రెండు నుంచి ఎనిమిదికి పెంచి నిరంతరం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అవసరమైన వైద్య సిబ్బంది, మందులు, పరికరాలతో పాటు రెండు అగ్నిమాపక యంత్రాలు, ఫైర్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని, ఇరుకైన మార్గాల్లోకి సైతం అత్యవసర వాహనాలు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

భక్తులకు తాగునీటి కొరత లేకుండా నీటి సరఫరా సామర్థ్యాన్ని ఆరు లక్షల లీటర్లకు మించి పెంచాలని, పార్కింగ్ ప్రాంతాల్లోనూ ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని తెలిపారు. ఆలయ పరిసరాలు, ప్రధాన మార్గాల్లో తగినంత లైటింగ్ ఏర్పాటు చేసి, నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు అత్యవసర సమయాల్లో జనరేటర్లను సిద్ధంగా ఉంచాలన్నారు. మరుగుదొడ్ల నిర్వహణ, చెత్త తొలగింపు, పరిసరాల పరిశుభ్రతపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

రహదారులపై గుంతలను తొలగించి మరమ్మతులు చేపట్టాలని, ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో సుమారు మూడు కిలోమీటర్ల మేర రహదారి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఉత్సవ ప్రాంతంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, అధికారుల ఫోన్ నంబర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసుకుని సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు.

భక్తులకు కలెక్టర్ సూచనలు

ఉత్సవాలకు వచ్చే భక్తులు కర్రలు తీసుకుని రాకూడదని, మద్యం సేవించడం కానీ, మద్యం తీసుకురావడం కానీ చేయరాదని కలెక్టర్ సూచించారు. ఒకరిపై ఒకరు ద్వేషంతో దాడులకు పాల్పడరాదని, ప్రశాంత వాతావరణంలో ఉత్సవాన్ని జరుపుకోవాలని కోరారు. 110 వీడియో కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, హింసాత్మక ఘటనలకు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కేసుల నమోదు, అరెస్టులు సహా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు తావివ్వకుండా గ్రామస్థులు, భక్తులు పోలీసులకు, అధికారులకు పూర్తిగా సహకరించాలని కోరారు.

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, బన్ని ఉత్సవాలను సంప్రదాయాలకు అనుగుణంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు, గ్రామస్థులు పోలీసులకు సహకరించాలని కోరారు. బారికేడింగ్, లైటింగ్, సీసీ కెమెరాలు, నెట్‌వర్క్ వ్యవస్థలను పటిష్టం చేయాలని, ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు గోల్డెన్ అవర్‌లోనే వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన వైద్యులు, ముఖ్యంగా స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అంబులెన్సులు తిరిగి ఉత్సవ ప్రాంతానికి చేరుకుని సేవలందించడంలో ఆలస్యం జరగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు.

ఉత్సవాల సందర్భంగా పాత కక్షలు, వ్యక్తిగత వివాదాలు, గ్రామాల మధ్య విభేదాలకు తావివ్వరాదని ఎస్పీ స్పష్టం చేశారు. హింసాత్మక ఘటనలకు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కేసుల నమోదు, అరెస్టులు సహా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించాలని, భద్రతా నియమాలు, జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేయాలని పోలీసులకు సూచించారు.

ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, ఉత్సవాలు ముగిసే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్, ఎస్పీ అధికారులను ఆదేశించారు. భక్తులందరూ సంయమనం పాటిస్తూ, సంప్రదాయాలను గౌరవించి, పోలీసులకు సహకరించి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ మెట్ల మార్గం ద్వారా వెళ్లి శ్రీ మాళ మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.