కర్నూలు, అక్టోబర్ 3 (ఎక్స్‌ప్రెస్ టుడే): జిల్లాలోని చెరువులన్నింటినీ నీటితో నింపే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, హెల్త్ క్లినిక్స్, అంగన్వాడి భవనాలు, సిసి రోడ్ల పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు.

శనివారం ఉదయం జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరిగే వివిధ పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలోని త్రాగునీటి పనులకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని, వాటికి సంబంధించిన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

హంద్రీనీవా నీటి ప్రవాహం మరో పది రోజులు, ఎల్ఎల్సీ నీటి ప్రవాహం నవంబర్ 10వ తేదీ వరకు ఉండే అవకాశం ఉన్నందున జిల్లాలోని చెరువులను వెంటనే నింపాలని ఆమె ఆదేశించారు. జిల్లాలోని 35 చెరువులలో ఇంకా 18 చెరువులు పూర్తిగా నిండలేదని, వాటిలో 75 శాతం నీటి స్థాయిలో 11 చెరువులు, 50 శాతం స్థాయిలో 5 చెరువులు, 25 శాతం స్థాయిలో 2 చెరువులు ఉన్నాయని తెలిపారు. వీటిని కూడా పూర్తిస్థాయిలో నింపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

బోర్‌వెల్‌లను లోతుగా డ్రిల్ చేసే పనులు, ఫిల్టర్లను మార్చే ప్రక్రియ, సిసి డ్రైన్ల పనులను వెంటనే పూర్తి చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్‌ను కలెక్టర్ ఫోన్ ద్వారా ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న అతి ముఖ్యమైన పెండింగ్ పనులైన హెల్త్ క్లినిక్స్, అంగన్వాడి భవనాలు, సిసి రోడ్లు, టాయిలెట్స్ తదితర పనులను త్వరగా పూర్తి చేయాలని, అందుకు కావలసిన అనుమతులు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాంట్రాక్టర్లు కూడా పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లాకు ఇంకా రావలసిన 15వ ఫైనాన్స్ కమిషన్, 16వ ఫైనాన్స్ కమిషన్ నిధులను రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.