కర్నూలు, అక్టోబర్ 28 (ఎక్స్‌ప్రెస్ టుడే): వ్యవసాయ రంగంలో డిజిటల్ సేవలను విస్తృతం చేసి, రైతులకు సేవలను మరింత సులభంగా అందించేందుకు అమలు చేస్తున్న అగ్రిస్టాక్‌కు సంబంధించి రైతుల ఐడీ జనరేషన్, ఈ-కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ‘అగ్రిస్టాక్’ అమలుపై వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులతో జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల ఐడీ జనరేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, రైతుల ఈ-కేవైసీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని, రైతు ఐడీల జనరేషన్‌లో ఎలాంటి పొరపాట్లు లేకుండా సంబంధిత రికార్డులను సూపర్ చెక్ చేయాలన్నారు. అగ్రిస్టాక్ అమలును పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో వ్యవసాయ రంగానికి సంబంధించిన వాస్తవ సమస్యలను గుర్తించడం, అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలించి వివిధ శాఖల డేటాతో అనుసంధానం చేయడం, రైతులకు ఉపయోగపడే ఆచరణాత్మక పరిష్కారాలను రూపొందించి వాటి అమలును సమీక్షించడం టాస్క్‌ఫోర్స్ ప్రధాన బాధ్యతలుగా ఉంటాయన్నారు.

ఫార్మర్ ఐడీ ఆధారంగా భూ రికార్డులు, డిజిటల్ క్రాప్ సర్వే వివరాలు, భూమి యాజమాన్య సమాచారం తదితర అంశాలను అనుసంధానం చేయడం ద్వారా రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావచ్చని, అదే విధంగా ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ యంత్రాలు (అగ్రికల్చర్ మెషినరీ) తదితర సేవలకు సంబంధించిన సమాచారాన్ని కూడా రైతుల అవసరాలకు అనుగుణంగా అనుసంధానం చేస్తే వ్యవసాయ సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ వ్యవసాయ అధికారులకు సూచించారు.

నీటి పారుదల శాఖ పరిధిలో కాలువల వారీగా వివరాలను సేకరించడంతో పాటు, డ్రై, వెట్ కేటగిరీల కింద ఉన్న బోర్లు, బావుల స్థితిగతులను నమోదు చేయాలని, ఆయా నీటి వనరుల ద్వారా అందుబాటులో ఉన్న నీటి పరిమాణం, వాటి వినియోగానికి సంబంధించిన వివరాలను సేకరించి, అవసరమైన సమాచారాన్ని పొందుపరచాలని కలెక్టర్ ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. అదే విధంగా, పంచాయతీరాజ్, ఉద్యానవన, అటవీ తదితర శాఖల అధికారులు తమ పరిధిలోని వివరాలను సేకరించి నమోదు చేయాలన్నారు.

సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డీఆర్ఓ సి. వెంకట నారాయణమ్మ, ఇరిగేషన్ ఎస్ఈ శైలేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, సీపీఓ భారతి, జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రాజాకృష్ణ రెడ్డి, ఎల్‌డీఎం మోహన్, మార్కెటింగ్ ఏడీ నారాయణ మూర్తి, పశుసంవర్ధక శాఖ అధికారి డా. రాజశేఖర్, మత్స్య శాఖ అధికారి రంగనాథ్ బాబు, న్యాచురల్ ఫార్మింగ్ అధికారి మాధురి తదితరులు పాల్గొన్నారు.