కర్నూలు, అక్టోబర్ 31 (ఎక్స్‌ప్రెస్ టుడే): కర్నూలు జిల్లాలో నవంబర్ 1వ తేదీన జరిగే స్థానిక పట్టణ సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు శనివారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ. సిరి ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు జిల్లాలో కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీ పరిధిలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నాలుగు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 780 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కేటాయించడం జరిగిందని, ఇందులో భాగంగా 884 మంది ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), 864 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓలు), 3,679 మంది ఇతర పోలింగ్ అధికారులు (ఓపీఓలు) కలిపి మొత్తం 5,427 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఎన్నికల విధులకు కేటాయించిన ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యతలను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా

జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి 192 హైపర్ సెన్సిటివ్, 225 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా హైపర్ సెన్సిటివ్/సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

పోలింగ్ కేంద్రాల లోపల, బయట నిరంతర నిఘా ఉండేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించే విధంగా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు

304 కౌంటింగ్ టేబుళ్లు, 1,838 మంది కౌంటింగ్ సిబ్బంది నియామకం

జిల్లాలోని కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు పురపాలక సంఘాలు, గూడూరు నగర పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు–2026 ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.

కర్నూలు నగరపాలక సంస్థకు అథెనా పాఠశాలలో, ఆదోని పట్టణ పాలక సంస్థకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో, ఎమ్మిగనూరు పురపాలక సంఘానికి బనవాసి గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో, గూడూరు నగర పంచాయతీకి గూడూరు మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణం ఇండోర్ భవనంలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 304 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేయడంతో పాటు, 370 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 1,468 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు కలిపి మొత్తం 1,838 మంది సిబ్బందిని కేటాయించినట్లు వెల్లడించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్ ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.