విశాఖపట్నం, సెప్టెంబర్ 19: విశాఖపట్నం సాగరమాల కన్వెన్షన్‌లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు, పీఏసీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ విశాఖపట్నం నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులంతా సమన్వయంతో, క్రమశిక్షణతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గం, మండలం, గ్రామం, వార్డు స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజలతో నిరంతరం మమేకమవుతూ జనసేన పార్టీకి ఘన విజయాన్ని అందించే దిశగా కృషి చేయాలని సూచించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి జనసైనికుడు పనిచేయాలని స్పష్టం చేశారు. పార్టీకి కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అన్నారు.

జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు, సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి, పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఐక్యతతో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలు, అధినేత ఆశయాలను క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.