రణస్థలం, అక్టోబర్ 2 (ఎక్స్ప్రెస్ టుడే): మెగా రక్తదాన శిబిరంలో ఒకేరోజు తొమ్మిది వందల పదహారు యూనిట్ల రక్తాన్ని సేకరించి యువత సరికొత్త చరిత్ర సృష్టించిందని, ప్రాణాపాయంలో ఉన్నవారిని ఆదుకునేందుకు రక్తదానం మిక్కిలి శ్రేష్ఠమైన మార్గమని ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్ఈఆర్), విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.
గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కో-కన్వీనర్ నడుకుదిటి తేజబాబు ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్ఈఆర్ ఇచ్చిన పిలుపునకు నియోజకవర్గ నలుమూలల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఉదయం నుంచే వేలాదిగా తరలివచ్చిన యువత, నాయకులు, మహిళలు స్ఫూర్తిదాయక వాతావరణంలో రక్తదానం చేసేందుకు పోటీ పడ్డారు.
సమాజ సేవే ధ్యేయంగా కూటమి నాయకులు ముందుకు సాగుతున్నారని, యువత ఈ రకంగా స్పందించి రికార్డు స్థాయిలో రక్తాన్ని విరాళంగా ఇవ్వడం ఎచ్చెర్ల చరిత్రలోనే నిలిచిపోతుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్పష్టం చేశారు.
ఈ రక్తదాన మహాయజ్ఞంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన పది ప్రముఖ బ్లడ్ బ్యాంక్ సంస్థలు పాల్గొని రక్త సేకరణలో సాంకేతిక సాయం అందించాయని నిర్వాహకులు వెల్లడించారు.
ప్రాణదాతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే ఎన్ఈఆర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు విభాగం సమన్వయంతో కార్యక్రమానికి వచ్చిన దాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వసతులు కల్పించారు.
