అమరావతి, సెప్టెంబర్ 18: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ షిప్‌బిల్డింగ్, మెరైన్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటుకు మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
ముఖ్యాంశాలు: రూ.15,000 కోట్ల పెట్టుబడితో దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ · 45,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు · ఏటా 12 లక్షల గ్రాస్ టన్నుల (1.2 మిలియన్ GT) నౌకా నిర్మాణ సామర్థ్యం · మజగాన్ డాక్ యార్డ్ లిమిటెడ్‌ను యాంకర్ షిప్‌యార్డ్‌గా ఎంపిక
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సచివాలయంలో ఎండీఎల్, ఏపీ మారిటైమ్ బోర్డు– విశాఖపట్నం పోర్టు అథారిటీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎస్పీవీ సంస్థ నేషనల్ షిప్‌బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్–ఏపీ (NSHIP-AP) మధ్య ఈ కీలకమైన అవగాహనా ఒప్పందం జరిగింది.
రూ.15 వేల కోట్ల పెట్టుబడితో షిప్‌యార్డ్
దుగరాజపట్నంలో ఆధునిక గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ నిర్మాణం కోసం వచ్చే 5 ఏళ్లలో ఎండీఎల్ సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో సుమారు 45,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. షిప్‌బిల్డింగ్‌తో పాటు అనుబంధ పరిశ్రమలు, మెరైన్ ఇంజినీరింగ్, లాజిస్టిక్స్, సర్వీసెస్ తదితర రంగాల్లో పెద్దఎత్తున ఉపాధి, పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
ఏడాదికి 12 లక్షల టన్నుల సామర్థ్యం
ప్రతిపాదిత షిప్‌యార్డ్ ఏటా 12 లక్షల గ్రాస్ టన్నుల (1.2 మిలియన్ GT) నౌకా నిర్మాణ సామర్థ్యంతో రూపుదిద్దుకోనుంది. భవిష్యత్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు కూడా వీలుంది. ట్యాంకర్లు, బల్క్ క్యారియర్లు, కంటైనర్ నౌకలు, ఎల్ఎన్జీ క్యారియర్లు, ఇతర భారీ ప్రత్యేక నౌకలను నిర్మించేలా ఈ షిప్‌యార్డ్‌ను అభివృద్ధి చేయనున్నారు. దీని ద్వారా దేశీయ అవసరాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు కూడా నౌకలను నిర్మించే సామర్థ్యం రాష్ట్రానికి అందుబాటులోకి రానుంది.
దుగరాజపట్నంలో సమగ్ర నౌకా నిర్మాణ క్లస్టర్
దుగరాజపట్నంలో షిప్‌బిల్డింగ్-కమ్-పోర్ట్ క్లస్టర్ అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (TEFR) ప్రకారం షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్ యార్డ్‌కు సుమారు రూ.29,254 కోట్లు, పోర్టు అభివృద్ధికి సుమారు రూ.9,513 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. దుగరాజపట్నం పోర్టును కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు ఆమోదం తెలిపింది. షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌ను కూడా కేంద్ర ప్రభుత్వ షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీం కింద అభివృద్ధి చేయనున్నారు. ఈ క్లస్టర్‌కు మజగాన్ డాక్ యార్డ్ లిమిటెడ్‌ను యాంకర్ షిప్‌యార్డ్‌గా ఎంపిక చేశారు.
జాతీయ షిప్‌బిల్డింగ్ లక్ష్యాలకు అనుగుణంగా
భారత్‌ను 2047 నాటికి ప్రపంచంలోని అగ్రశ్రేణి షిప్‌బిల్డింగ్ దేశాల్లో ఒకటిగా నిలబెట్టాలన్న జాతీయ లక్ష్యానికి దుగరాజపట్నం ప్రాజెక్టు దోహదపడనుంది. మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047, కేంద్ర ప్రభుత్వ షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీం లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఎండీఎల్ సీఎండీ జగ్మోహన్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చైర్పర్సన్ జస్మీత్ సింగ్ బింద్రా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
