(ఎక్స్‌ప్రెస్ టుడే): రాష్ట్రంలో ప్రకృతి సేద్యం పెంపు, పీఎండీఎస్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఇందులో మంత్రి అచ్చెన్నాయుడు, రైతులు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ప్రకృతి సేద్యం విస్తరణ
కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు, రైతులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి.. ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతం చేస్తూ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకున్నామని అన్నారు. నేచురల్ ఫార్మింగ్ విజయవంతం కాదని గతంలో కొందరు దుష్ప్రచారం చేశారన్నారు. 2016లో 40 వేల మంది రైతులతో ప్రారంభమైన సేద్యం నేడు 17.73 లక్షల మంది రైతులకు చేరిందని, రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
ప్రకృతి సేద్యంలో గుజరాత్ కంటే ఏపీ అగ్రస్థానంలో ఉందని ఇటీవల ప్రధాని మోదీ చెప్పారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో చేస్తున్న ప్రకృతి సాగుపై ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతినిధులు మన విధానాలను అధ్యయనం చేస్తున్నారన్నారు. కేంద్రం కూడా జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పాలసీ ద్వారా రైతులకు ఆసరాగా నిలుస్తోందని చెప్పారు. ఈ నెల 15వ తేదీన నిర్వహించే సరస్ మేళాలో కూడా ప్రకృతి సేద్య విధానాలను ప్రదర్శిస్తామని తెలిపారు.
ఆదాయం, రసాయన ఎరువుల వినియోగం
రసాయన ఎరువులతో భూసారం క్షీణిస్తుందని, సాగు ఖర్చులు పెరిగి రైతుకు భారంగా మారుతుందని ముఖ్యమంత్రి అన్నారు. రసాయన ఎరువులతో పోలిస్తే నేచురల్ ఫార్మింగ్ ద్వారా 47 శాతం మేర ఆదాయం పెరిగిందని చెప్పారు. నేచురల్ ఫార్మింగ్ ద్వారా సాగు చేస్తే పత్తి పంటలో 96 శాతం, కందుల్లో 87 శాతం మేర నికర ఆదాయం వచ్చిందని తెలిపారు. పెట్టుబడి వ్యయం తగ్గి రైతులకు రాబడి పెంచేలా ఈ వ్యవసాయం ఉపకరిస్తుందన్నారు.
2023–24 కంటే ముందు సంవత్సరాలతో పోలిస్తే ఏపీలో 6 శాతం మేర రసాయన ఎరువుల వినియోగం తగ్గిందని, గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు మరో 2.28 శాతం తగ్గిందని వెల్లడించారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించినందుకు కేంద్రం ఇచ్చే రూ.218 కోట్ల ప్రోత్సాహకాలపై ఇప్పటికే లేఖ రాశామని తెలిపారు.
ఎల్‌నినో, కరవు పరిస్థితులు
తీవ్రమైన కరవు పరిస్థితిని కూడా సహజ సేద్యం తట్టుకుని ఎక్కువ దిగుబడులు ఇస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రస్తుతం ఎల్‌నినో కరవును తట్టుకునేలా ప్రకృతి సాగు ద్వారా భూతాపాన్ని తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. గ్రీన్ కవర్ పెరిగితే తేమను కాపాడుకునేందుకు ఆస్కారం ఉంటుందని, చిన్నపాటి వర్షం పడినా పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులకు ఏడాది పొడవునా ఆదాయ ప్రయోజనాలతో పాటు పశుగ్రాసం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు లభిస్తాయన్నారు.
ఇటీవల కురిసిన వర్షాలతో లోటు వర్షపాతం 34 శాతానికి తగ్గిందని, ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రకృతి సేద్యాన్ని కొనసాగించామని చెప్పారు. రాయలసీమలో ఉద్యాన పంటలు, ఇతర ప్రాంతాల్లో పౌల్ట్రీపై దృష్టి పెట్టామన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేలా అనంతపురం జిల్లాలోనే 10 లక్షల పంట కుంటలు తవ్వించామని, చెక్ డ్యామ్‌లు, ట్రెంచ్‌లను తవ్వడంతో పాటు స్థానికంగా ఉన్న నీటి వనరుల బేసిన్లను అనుసంధానించామని తెలిపారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 500 టీఎంసీల గోదావరి వరద జలాలను కృష్ణా డెల్టాకు తరలించి సద్వినియోగం చేశామని, నదుల అనుసంధానంతో ఓ ఏడాది వర్షాలు కురవకపోయినా ఇబ్బందులను అధిగమించే అవకాశం ఉంటుందని చెప్పారు.
రైతులే స్ఫూర్తి
ప్రకృతి సేద్యం విస్తరణకు అందరూ యుద్ధ ప్రాతిపదికన పనిచేశారని, అందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. నిరంతర చైతన్యం ద్వారా ప్రకృతి వ్యవసాయంలో దేశానికే ఆదర్శంగా నిలిచే పరిస్థితి ఉంటుందన్నారు. ప్రకృతి సేద్యాన్ని ముందుకు తీసుకెళ్తున్న రైతులే తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. కషాయం, జీవామృతం తయారీకి దేశీయ ఆవుల కోసం మరిన్ని గోకులాలు నిర్మిద్దామని సూచించారు.
