అమరావతి, సెప్టెంబర్ 20: ఎల్ నినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, యాక్షన్ ప్లాన్ అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు, ఆర్ఎస్‌కే సిబ్బందితో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ఎల్ నినో సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు.

  • ఎల్ నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, ధరలు తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని సీఎం సూచన
  • బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలను అదుపులో పెట్టాలంటూ అధికారులకు ఆదేశం
  • హైరిస్క్ ఆర్ఎస్‌కే పరిధిలోని ఉద్యాన పంటల రక్షణకు రూ.190 కోట్ల నిధులు సద్వినియోగం చేసుకోవాలని సూచన
  • డిమాండ్ ఆధారిత పంటల సాగుపై ఫోకస్ పెట్టాలని, తాత్కాలిక, మధ్యంతర ప్రణాళికలతో వెళ్లాలని సీఎం సూచన

ధరల నియంత్రణపై దిశా నిర్దేశం

ఎల్ నినో పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకున్నామని, సిద్ధం చేసుకున్న యాక్షన్ ప్లాన్ ప్రకారం ప్రతి ఒక్కరూ పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎల్ నినో ప్రభావం కేవలం రైతుల మీదే కాదని, అన్ని వ్యవస్థలపై పడుతుందని పేర్కొన్నారు. ఎల్ నినో బారి నుంచి రైతులను కాపాడే ప్రయత్నం చేస్తూనే ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని, డిమాండ్‌కు అనుగుణంగా వివిధ పంటలు సాగు చేయాలని సూచించారు. పంటల బీమా చేయించామని, పంట నష్టం సంభవిస్తే బీమా మొత్తం రైతులకు దక్కేలా చూడాలని ఆదేశించారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు వంటి నిత్యావసరాల ధరలను కంట్రోల్ చేయాలని, గోడౌన్లలో బియ్యం నిల్వలు ఎంత మేరకు ఉన్నాయో పరిశీలించి, ధరలను అదుపులో ఉంచేందుకు నిల్వలను మార్కెట్‌లోకి వదిలేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఉల్లి, పామాయిల్, కూరగాయల ధరల నియంత్రణ

ప్రస్తుతం ఉల్లి ధరలను కంట్రోల్ చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తున్నామని, రానున్న కాలంలో ఉల్లికి ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా సాగును ప్రోత్సహించాలని సీఎం సూచించారు. పామాయిల్, కందిపప్పు ధరలను అదుపులో పెట్టేలా ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను త్వరితగతిన అమలు చేయాలని ఆదేశించారు. స్వయం సహాయక బృందాల ద్వారా కిచెన్ గార్డెన్లను ప్రోత్సహించి, వాటిని వ్యవస్థీకృతం చేయగలిగితే కూరగాయల ధరలు అదుపులో ఉంటాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకు అందించే కనీస మద్దతు ధరపై కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. విపత్తులు సంభవించినప్పుడు ఆ ప్రభావం ప్రజలపై పడకుండా చూడటం ప్రభుత్వాల బాధ్యత అని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు, వినియోగదారులు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు.

వర్షపాత లోటు, కంటింజెన్సీ ప్రణాళిక

ఎల్ నినో విపత్తును సవాలుగా స్వీకరించి, ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, రైతు, సాగు నీటి సంఘాలు సమన్వయంతో పని చేయాలని సీఎం సూచించారు. కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ వర్షాధార పంటలు, ప్రకృతి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉద్యాన పంటలపై హైరిస్క్ ఉందని, వాటిని కాపాడేందుకు రూ.190 కోట్లు కేటాయించామని, ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 50.7 శాతం మేర లోటు వర్షపాతం నమోదైందని, ప్రకాశం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో అత్యధిక లోటు వర్షపాతం కనిపిస్తోందని అధికారులు వెల్లడించారు. ఖరీఫ్ సీజన్‌లో 30.84 లక్షల హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా, ఎల్ నినో కారణంగా 79 శాతం భూముల్లో సాగు పనులు మొదలుపెట్టినట్టు తెలిపారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోని పంటలపై ఎల్ నినో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని, ఇప్పటికే సిద్ధం చేసుకున్న కంటింజెన్సీ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. 5.21 లక్షల హెక్టార్లకు పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, పచ్చిరొట్ట ఎరువులు సరఫరా చేశామని, 1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 80 శాతం సబ్సిడీతో సరఫరా చేశామని, ఖరీఫ్ కంటింజెన్సీ ప్రణాళిక కోసం రూ.60 కోట్లు సిద్ధం చేసుకున్నామని వివరించారు.

హంద్రీ-నీవా, సాగునీటి ప్రాజెక్టులపై సీఎం

అధికారులు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, స్థానిక ఎన్నికలు ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులు ఎల్ నినో అంశంపై గ్రామాల్లో ఎక్కువగా పర్యటించి రైతుల్లో అవగాహన పెంచాలని సీఎం సూచించారు. సంప్రదాయేతర ప్రాంతాల్లో కూడా ఉల్లి, మిరప సాగును చేపట్టాలని అన్నారు. ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలతో కరవు ప్రభావిత ప్రాంతాలకు నీటిని పంపగలుగుతున్నామని, హంద్రీ-నీవా ద్వారా చివరి భూములకు నీరందించామని, తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్న చర్యల వల్లే ఎల్ నినో వంటి సమయాల్లో కూడా హంద్రీ-నీవా కాల్వల్లో నీరు వస్తుందని, రూ.3,500 కోట్ల ఖర్చుతో 100 రోజుల్లో హంద్రీ-నీవా కాల్వల్లో నీటిని పారించగలిగామని పేర్కొన్నారు. 2014-19 మధ్య కాలంలో ఇరిగేషన్ నిమిత్తం రూ.65 వేల కోట్లు ఖర్చు పెట్టామని, 2019-24 మధ్యన నాటి ప్రభుత్వం కేవలం రూ.22 వేల కోట్లే ఖర్చు పెట్టిందని, ప్రాజెక్టులు పూర్తి అయ్యుంటే ఎల్ నినో వంటి విపత్తు వచ్చినా ఇబ్బంది ఉండేది కాదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.