అనకాపల్లి, అక్టోబర్ 14 (ఎక్స్‌ప్రెస్ టుడే): అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం చెన్నాపాలెంలోని వశిష్ట డెయిరీలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫుడ్ సేఫ్టీ, పౌరసరఫరాలు, పంచాయతీ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.

డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో పలు నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారీ యూనిట్‌లో నీటి నిల్వ ట్యాంకు సమీపంలో అపరిశుభ్ర పరిస్థితులను గుర్తించారు.

తయారీ తేదీ, గడువు తేదీ వంటి తప్పనిసరి వివరాలు లేని సుమారు రూ.70 వేల విలువైన ఆహార ఉత్పత్తులతో పాటు గడువు ముగిసిన శీతల పానీయాలను గుర్తించారు. వాణిజ్యేతర వినియోగానికి ఉద్దేశించిన నాలుగు ఎల్‌పీజీ సిలిండర్లను వినియోగిస్తున్నట్లు, సుమారు ఏడాది కాలంగా ట్రేడ్ లైసెన్స్ లేకుండా యూనిట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

గేదె నెయ్యి, ఆవు నెయ్యి, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌కు సంబంధించిన మూడు నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. నివేదికల ఆధారంగా చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

జిల్లాలో ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాల అమలుకు సంయుక్త తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.