అనకాపల్లి, అక్టోబర్ 23: రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పాక్షికంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల విధులపై ప్రతి అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. శుక్రవారం కొత్తూరులోని ఎ.ఎమ్.ఎ. ఆదినారాయణ ఉన్నత పాఠశాలలో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు మొదటి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణలో ఎన్నికల నియమావళి, ఓటింగ్ ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల గుర్తింపు, చెరగని సిరా వినియోగం, బ్యాలెట్ పత్రాల జారీ తదితర అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు. బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయడం, పేపర్ సీల్స్ వేయడం, పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను సీల్ చేసే విధానంపై ప్రాక్టికల్ శిక్షణ అందించారు.
అలాగే టెండర్డ్ ఓట్లు, ఛాలెంజ్డ్ ఓట్ల నిర్వహణతోపాటు అంధులు, దివ్యాంగులైన ఓటర్లకు సహాయం అందించే సమయంలో పాటించాల్సిన నిబంధనలను వివరించారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేస్తూ, పోలింగ్ ప్రక్రియను నిర్దేశిత సమయానికి అనుగుణంగా నిర్వహించే విధానంపై శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు, ఎన్నికల అధికారులు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలను ప్రతి అధికారి కచ్చితంగా పాటించాలని, పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్, డిప్యూటీ సీఈవో, అనకాపల్లి ఎంపీడీవో, ఎన్నికల అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పాల్గొన్నారు.
