అనకాపల్లి, అక్టోబర్ 1 (ఎక్స్‌ప్రెస్ టుడే): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.
గురువారం ఉదయం చోడవరం నియోజకవర్గం, రోలుగుంట మండలంలోని కంచు గుమ్మల గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేశారు.
మానసిక వికలాంగులైన గడమల సుకుమార్‌కు రూ.15,000 నగదును కలెక్టర్ స్వయంగా అందజేశారు. అదేవిధంగా శారీరక దివ్యాంగురాలైన సండక సింహాచలంకు రూ.6,000, మరో లబ్ధిదారుడైన ఈ. అప్పారావుకు వృద్ధాప్య పింఛన్ కింద రూ.4,000 చొప్పున కలెక్టర్ నగదు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నెలనెలా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా, ఎవరైనా డబ్బులు అడిగారా అంటూ ఆరా తీశారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
