రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ — మొదటి కోర్టు హాల్లో ప్రమాణ స్వీకారం
అమరావతి, అక్టోబర్ 5 (ఎక్స్ప్రెస్ టుడే): ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తులుగా అదనపు న్యాయమూర్తులు జస్టిస్ కుంచం మహేశ్వరరావు, జస్టిస్ తూట చంద్ర ధనశేఖర్ (టీసీడీ శేఖర్), జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణ రావు బాధ్యతలు స్వీకరించారు.
ఏపీ హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఫుల్ బెంచ్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో, శాశ్వత న్యాయమూర్తులుగా ఈ ఐదుగురితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు.
రాష్ట్రపతి ఆమోదంతో నోటిఫికేషన్
రాష్ట్ర హైకోర్టులో ఐదుగురు శాశ్వత న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం ఈ ఐదుగురు శాశ్వత న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం జరిగింది.
ఏపీ హైకోర్టులో సేవలందిస్తున్న ఇతర గౌరవనీయ న్యాయమూర్తులందరూ ఈ వేడుకకు హాజరై తమ సహచర న్యాయమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు, న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
