అమరావతి, అక్టోబర్ 8 (ఎక్స్‌ప్రెస్ టుడే): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబరు 2026) ప్రభుత్వాసుపత్రుల పనితీరు, బడ్జెట్ వ్యయంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో 4 గంటలపాటు లోతుగా సమీక్షించారు. రోగులకు అందుతున్న సేవలు, వివిధ శాఖల పనితీరుపట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షల మేరకు ప్రజల సంతృప్తి స్థాయికి అనుగుణంగా నాణ్యమైన సేవలు అందించడం అందరి సమష్టి బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు.

గత ఆరు నెలల కాలంలో వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో ఇన్‌పేషెంట్ అడ్మిషన్లు భారీగా పెరిగినట్లు సమీక్షలో వెల్లడైంది. 2025-26 సంవత్సరానికి ప్రభుత్వాసుపత్రుల్లో మొత్తం 27,29,534 మంది రోగులు చికిత్స నిమిత్తం చేరారు. ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబరు మధ్య కాలంలో ఇన్‌పేషెంట్ల సంఖ్య 15,77,398కి చేరి, గత సంవత్సరంలోని మొదటి 6 నెలల కంటే సుమారు 8% వృద్ధి నమోదైనట్లు అధికారులు మంత్రికి వివరించారు.

ఈ పరిణామం ప్రభుత్వాసుపత్రుల పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, విశ్వాసానికి చిహ్నమని, ఈ స్ఫూర్తితో వైద్య సిబ్బంది మరింత దీక్షతో సేవలు అందించాలని మంత్రి సూచించారు. ఇన్‌పేషెంట్ల రద్దీకి తగ్గట్టు ప్రధాన బోధన ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని డీఎంఈ అధికారులను ఆదేశించారు.

ఆయుష్ ఆసుపత్రుల్లో చేరిన ఇన్‌పేషెంట్ల సంఖ్య గత ఆరు నెలల్లో 21% పెరగడం ఈ సేవల పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు తార్కాణమని మంత్రి అన్నారు. గత ఆరు నెలల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2025-26తో పోల్చితే ఓపీ సేవలు నిలకడగా కొనసాగాయి. డీఎంఈ ఆసుపత్రుల్లో గత ఏడాది ప్రథమార్ధంతో పోలిస్తే దాదాపు 2% వృద్ధి నమోదైంది. ఆయుష్ ఆసుపత్రుల్లో ఓపీ సేవల్లో 15% భారీ పెరుగుదల కనిపించింది. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో గత ఏడాది స్థాయిలో ఓపీ సేవలు కొనసాగగా, పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది.

డయాగ్నస్టిక్ సేవల్లోనూ పురోగతి కనిపించింది. రోగాల నిర్ధారణకు కీలకమైన డయాగ్నస్టిక్ సేవలు 2025-26లో 18.19 కోట్లుగా నమోదు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఇవి 9.65 కోట్లుగా నమోదై 3.03% పెరిగాయి. ప్రభుత్వాసుపత్రుల పనితీరు, వాటిపట్ల ప్రజాభిప్రాయాన్ని వెల్లడించే ఈ మూడు అంశాల్లో గత ఆరు నెలల్లో సత్ఫలితాలు రావడంపట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

ప్రభుత్వాసుపత్రుల్లో సేవలు పొందే రోగులకు నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండేలా చేసేందుకు మధ్యాహ్నం పూట కూడా వారి హాజరును నమోదు చేసే విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. గతానికి భిన్నంగా కూటమి ప్రభుత్వ హయాంలో వైద్య సిబ్బంది హాజరు 80% నుంచి 90% వరకు నమోదవుతోందని, అయినా పనివేళల్లో కొందరు వైద్యులు విధుల్లో ఉండడం లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేసే హాజరు నమోదుకు అదనంగా మధ్యాహ్నం పూట కూడా హాజరు తీసుకోవడంపై సమగ్ర ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

గత ఆరు నెలల్లో వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బంది హాజరు 85.8% నుంచి 92.0% వరకు నమోదుకాగా, డీఎంఈ ఆసుపత్రుల్లో మాత్రం హాజరు 5% తగ్గి 76.02%గా నమోదైనట్లు సమీక్షలో వెల్లడైంది. ఈ తగ్గుదలకు కారణాలను సమగ్రంగా విచారిస్తామని డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ మంత్రికి హామీ ఇచ్చారు. మంత్రిత్వ శాఖలోని 9 విభాగాల్లో గత ఆరు నెలల్లో ఆరింట్లో హాజరు పెరగ్గా, పట్టణ ఆరోగ్య కేంద్రాలు మరియు ఐపీఎంలో హాజరు కొంతమేరకు తగ్గినట్లు నమోదైంది.

గత ఆరు నెలల్లో బడ్జెట్ వ్యయం బాగా పెరిగినట్లు సమీక్షలో వెల్లడైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ (మొదటి త్రైమాసికం) కాలంలో బడ్జెట్ వ్యయం 20% లోపుగానూ, కేంద్ర నిధుల వినియోగం కేవలం 17% మాత్రమే నమోదు కావడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసి, రెండో త్రైమాసికం చివరకు బడ్జెట్ వ్యయం 50% ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరిమిలా తాజా సమీక్షలో కేంద్ర నిధుల వ్యయం గత ఆరు నెలల కాలానికి 52% నమోదు కాగా, మొత్తం బడ్జెట్ వ్యయం 44%కి చేరుకుంది. గత 3 నెలల్లో ఈ విషయంలో సాధించిన ప్రగతిపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంత్రిత్వ శాఖలోని ప్రధాన విభాగాలకు మొత్తం కేటాయింపులు రూ.19,316.25 కోట్లు కాగా, గత ఆరు నెలల్లో మొత్తం రూ.8,501.44 కోట్ల ఖర్చు నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ వ్యయంలో కేంద్ర సాయం రూ.2,673.28 కోట్లు ఉండగా, గత ఆరు నెలల్లో వివిధ విభాగాలు రూ.1,390.01 కోట్ల మేరకు వినియోగించుకున్నాయి.

ఇంజినీరింగ్ విభాగంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రులకు సంబంధించిన పలు ప్రధాన నిర్మాణ పనుల్లో ఏపీఎస్‌ఎంఐడీసీ ఇంజినీరింగ్ విభాగం వైఫల్యాలు వెల్లడికావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పాత మరియు కొత్త సర్వజనాసుపత్రులు, వైద్య కళాశాలల నిర్మాణాలకు సంబంధించిన కేటాయింపుల్లో అతి స్వల్ప వ్యయం నమోదుకావడానికి ఇంజినీరింగ్ విభాగం పనితీరు కారణమని నిర్ధారణ అయింది. ఈ అంశంపై సమీక్ష జరుగుతున్న సమయంలో ఏపీఎస్‌ఎంఐడీసీ చీఫ్ ఇంజినీర్‌తో పాటు సహచర ఇంజినీర్లు సమీక్షలో లేకపోవడంపట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ విభాగం పనితీరును గాడిన పెట్టేందుకు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని శాఖ కార్యదర్శి వీర పాండియన్‌ను ఆదేశించారు.

సమీక్షా నిర్ణయాలను పటిష్ఠంగా అమలు చేయాలని మంత్రిత్వ శాఖ కార్యదర్శి వీర పాండియన్ వివిధ విభాగాధిపతులను, ఉన్నతాధికారులను ఆదేశించారు. తాజా చర్చ మేరకు బడ్జెట్ అంశాలను మరింత స్పష్టంగా, సమగ్రంగా నివేదించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు సీఈఓ పద్మావతి, ఆయుష్ కమిషనర్ రోణంకి గోపాలకృష్ణ, ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పీడీ స్మరణ్ రాజ్, డ్రగ్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ జనరల్ అరుణ్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.