ఫైల్ ఫొటో: అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం
అమరావతి, అక్టోబర్ 7 (ఎక్స్‌ప్రెస్ టుడే): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ సహా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులతో సీఎం భేటీ కానున్నారు.
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుతో పాటు బీచ్ కారిడార్ ప్రాజెక్టులను మంజూరు చేయాలని ప్రధాని మోదీకి సీఎం విజ్ఞప్తి చేయనున్నారు. ప్రత్యేకించి నదుల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన అధ్యయనం చేయించాలని కూడా కోరనున్నారు.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగించేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ప్రధాని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కోరనున్నారు.
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం కేంద్ర సహకారం అందించాలని ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే అంశంపై కూడా కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.
గోదావరి నది నుంచి పెద్ద ఎత్తున సముద్రంలోకి వెళ్తున్న వరద నీటిని సద్వినియోగం చేసుకునే అంశంతో పాటు నదుల అనుసంధానంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో భేటీలో చర్చించనున్నారు.
నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో నిర్వహించే సీఐఐ భాగస్వామ్య సదస్సు కర్టైన్ రైజర్ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
