ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగం సన్నద్ధతపై ముఖ్యమంత్రి సమీక్ష

తెల్లవారుజామున తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని అధికారుల వెల్లడి

తీరం దాటే సమయంలో గాలుల వేగం ఎక్కువగా ఉండొచ్చని, మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశం

ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద మురసు తుఫాన్ తీరం దాటుతుందని చెప్పిన అధికారులు

తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తీరం దాటేంత వరకు ప్రజలు బయటకు రావద్దని సూచన

ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడమే ప్రధాన లక్ష్యంగా పని చేయాలన్న ముఖ్యమంత్రి

అమరావతి, నవంబర్ 2 (ఎక్స్‌ప్రెస్ టుడే): మురసు తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగం సన్నద్ధతపై సమీక్షించిన ఆయన, తెల్లవారుజామున తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారని తెలిపారు. తీరం దాటే సమయంలో గాలుల వేగం ఎక్కువగా ఉండొచ్చని, మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద మురసు తుఫాన్ తీరం దాటుతుందని అధికారులు చెప్పారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు కొత్తపట్నం వద్ద వర్షాలు, గాలుల తీవ్రత ఏ విధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ప్రస్తుతం చిరుజల్లులు పడుతున్నాయని నెల్లూరు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఒంగోలులో మోస్తరు వర్షం పడుతోందని, తీరం దాటే కొత్తపట్నం సమీపంలో చిరుజల్లులు పడుతున్నాయని అధికారులు వివరించారు.

తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తీరం దాటేంత వరకు ప్రజలు బయటకు రావద్దని సూచించారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడమే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు.

టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...

తీరం దాటే సమయంలో గంటకు 100–110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా. తుఫాన్ తాకిడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలి.

స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల సిబ్బంది ద్వారా సమాచారం క్షేత్ర స్థాయికి వెళ్ళాలి.

ఆర్నబ్ తుఫాన్‌లో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు చర్యలు తీసుకున్నా... కొందరి ప్రాణాలను కాపాడుకోలేకపోయాం. ఈ మురసు తుఫానులో అలాంటివి జరగడానికి వీల్లేదు.

ఆస్తి నష్టం తగ్గించేలా చర్యలు తీసుకోవాలి... కాల్వలకు, చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆర్నబ్ తుఫాన్‌తో పోల్చుకుంటే గాలుల వేగం తక్కువగా ఉంది... అయితే విద్యుత్ సిబ్బంది అలర్ట్‌గా ఉండాలి. విద్యుత్ స్తంభాలు కూలినా, సరఫరాకు అంతరాయం కలిగినా పునరుద్ధరణ పనులు వేగంగా చేపట్టాలి.

రేపు వర్షాల ప్రభావం అత్యధికంగా ఉంటుందని అంచనా

ఎన్టీఆర్ జిల్లాలో 263 మి.మీ., గుంటూరులో 242 మి.మీ. సగటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. బాపట్లలో 146 మి.మీ., పల్నాడులో 143 మి.మీ. సగటు వర్షపాతం అంచనా.

రేపు కృష్ణా జిల్లాలో 97.67 మి.మీ., ప్రకాశంలో 52.43 మి.మీ., ఏలూరులో 51.55 మి.మీ., పశ్చిమ గోదావరిలో 41.50 మి.మీ. సగటు వర్షపాతం పడుతుందని అంచనా.

తుఫాన్ ప్రభావిత ప్రాంతంలోని పలు మండలాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు మొత్తంగా 125 మండలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.