అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం

అమరావతి, అక్టోబర్ 7 (ఎక్స్‌ప్రెస్ టుడే): పాతికేళ్ల ప్రజా ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అభినందన తీర్మానం చేసింది. ప్రత్యేక తీర్మానం ద్వారా ప్రధానికి అభినందనలు, ప్రశంసలు తెలిపింది.

ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని అందించారని కేబినెట్ కొనియాడింది. అసాధారణ క్రమశిక్షణ, నిబద్ధతతో దేశానికి సేవలు అందించారని ప్రశంసించింది. దూరదృష్టి, స్పష్టమైన లక్ష్యం, సమర్థవంతమైన పాలనతో భారత్‌ను కీలక స్థానంలో నిలిపారని పేర్కొంది.

సృజనాత్మకత, ఆవిష్కరణ, వేగవంతమైన పాలనకు మోదీ ప్రాధాన్యం ఇచ్చారని మంత్రివర్గం కొనియాడింది. మౌలిక వసతులు, సాంకేతికత, సంక్షేమం, పారిశ్రామిక రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లారని, సాంకేతిక ఆధారిత పాలనతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని ప్రశంసించింది. సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను భాగస్వాములుగా మార్చి భారత్‌ను అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారని పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నా దేశానికి స్థిరమైన నాయకత్వాన్ని అందిస్తున్నారని రాష్ట్ర మంత్రివర్గం పేర్కొంది. సాహసోపేత నిర్ణయాలతో పాటు దీర్ఘకాలిక జాతీయ ప్రాధాన్యాలపై దృష్టి పెట్టి దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కేబినెట్ అభిప్రాయపడింది.

దేశ ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి ప్రపంచ వేదికలపై భారత్ ప్రతిష్ఠను పెంచారని మంత్రివర్గం కొనియాడింది. వ్యూహాత్మకంగా ప్రపంచ దేశాలతో భారత్‌కు బలమైన భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడంలో ప్రధాని కృషి కీలకమని, ప్రపంచ వ్యవహారాల్లో భారత్ స్వరానికి మరింత గౌరవం, విశ్వసనీయత పెరిగేందుకు ఆయన తోడ్పడ్డారని పేర్కొంది.

ఆధునిక, సాంకేతిక, స్వయం సమృద్ధి కలిగిన దేశ నిర్మాణానికి ప్రధాని మోదీ చేసిన కృషి ప్రశంసనీయమని సీఎం అన్నారు. మోదీ విజన్, రాజనీతిజ్ఞతతో భారత దేశ ప్రగతికి బలమైన పునాదులు పడ్డాయని ఏపీ మంత్రివర్గం అభిప్రాయపడింది.

21వ శతాబ్దం ప్రధాని మోదీదేనని, దేశసేవలో ఆయనకు మరిన్ని విజయాలు దక్కాలని ఆకాంక్షిస్తూ ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది.