రాష్ట్రంలో 2026–27 సంవత్సరానికి ఏ4 మద్యం షాపుల లైసెన్సుల రెన్యువల్ గడువును ఇకపై పొడిగించకూడదని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. బుధవారం అర్ధరాత్రి వరకు రెన్యువల్ ప్రక్రియ కొనసాగనుండగా, అనంతరం రెన్యువల్‌కు మిగిలిన షాపులకు తాజా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
సెప్టెంబర్ 23 నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 ఏ4 షాపులను రెన్యువల్‌కు నోటిఫై చేశారు. వీటిలో 3,236 షాపులు రెన్యువల్‌కు ముందుకు రాగా, 2,906 షాపులకు సంబంధించి చెల్లింపులు జరిగాయి. ఇందులో 2,873 షాపులు రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (RET) మొత్తాన్ని పూర్తిగా చెల్లించగా, 33 షాపులు పాక్షికంగా చెల్లింపులు చేశాయి. మొత్తం నోటిఫై చేసిన షాపుల్లో 88.7 శాతం రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోగా, 80 శాతం షాపులకు చెల్లింపులు జరిగాయి.
చెల్లింపుల శాతంలో తూర్పుగోదావరి జిల్లా 97.1 శాతంతో ముందంజలో ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా 94.7 శాతం, శ్రీ సత్యసాయి జిల్లా 91.8 శాతం, కోనసీమ జిల్లా 91.1 శాతం, ఏలూరు జిల్లా 91 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 64.5 శాతం, బాపట్లలో 68.8 శాతం, విశాఖపట్నంలో 69 శాతం చెల్లింపులు నమోదయ్యాయి.
సెప్టెంబర్ 23 అర్ధరాత్రి వరకు రెన్యువల్ RETలో 100 శాతం చెల్లించిన షాపులను రెన్యువల్‌కు పరిగణిస్తారు. అలాంటి షాపులను తాజా దరఖాస్తుల నోటిఫికేషన్లో చేర్చరు. సంబంధిత లైసెన్సుదారులకు వార్షిక RET, పర్మిట్ రూమ్ RET చెల్లించేందుకు రెండు రోజుల సమయం ఇవ్వనున్నారు.
రెన్యువల్ ప్రక్రియ అనంతరం మిగిలిపోయే ఏ4 షాపులతో పాటు ఇప్పటివరకు నోటిఫై చేయని ఏ4 షాపులకు తాజా దరఖాస్తుల ద్వారా లైసెన్సులు కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 24న విడుదల చేయనున్నారు. తాజా దరఖాస్తుల సమర్పణకు అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు గడువు ఉంటుంది. అక్టోబర్ 2న దరఖాస్తుల పరిశీలన నిర్వహించి, అక్టోబర్ 3న లాటరీ ద్వారా ఏ4 షాపుల కేటాయింపు చేపట్టనున్నారు.
