బోనస్ అనేది యాజమాన్యాల బిక్ష కాదు, కార్మికుల హక్కు — సిఐటియు

పరవాడ (ఫార్మా), అక్టోబర్ 5 (ఎక్స్‌ప్రెస్ టుడే): పరిశ్రమల యాజమాన్యాలు తక్షణమే ఈ నెల జీతాలతో కలిపి 20 శాతం బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం పరవాడ సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో లంకెలపాలెంలో నిరసన కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ... బోనస్ చట్టం 1965 ప్రకారం లాభాల్లో ఉన్న ప్రతి పరిశ్రమ 8.33 శాతం నుంచి 20 శాతం వరకు బోనస్ చెల్లించాలని అన్నారు. బోనస్ అనేది యాజమాన్యాల బిక్ష కాదని, అది కార్మికుల హక్కు అని, కార్మికులకు బకాయి పడిన వేతనమని ఆయన పేర్కొన్నారు.

పర్మినెంట్, కాంటాక్ట్, డైలీ వేజెస్, హౌస్ కీపింగ్ సహా అన్ని కేటగిరీల కార్మికులకు బోనస్ వర్తిస్తుందని తెలిపారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా ఈ నెల వేతనంతో పాటు అన్ని పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులకు వెంటనే 20 శాతం బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫార్మా యాజమాన్యాలపై బోనస్ కోసం కార్మికులందరూ ఒత్తిడి తేవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ కె. రమణి, శంకరమ్మ, ఆర్. వెంకటలక్ష్మి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.