అనకాపల్లి, సెప్టెంబర్ 18: అనకాపల్లి జిల్లాలోని క్రీడా వికాస కేంద్రం (KVK) వద్ద రూ.45 లక్షల అంచనా వ్యయంతో క్రికెట్ స్టేడియం అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ తెలిపారు.

ముఖ్యాంశాలు: రూ.45 లక్షల అంచనా వ్యయంతో క్రికెట్ స్టేడియం అభివృద్ధి · పరవాడ క్రీడా వికాస కేంద్రంలో ప్రహరీ గోడ, వాలీబాల్ కోర్టు నిర్మాణం ప్రారంభం · విశాఖ పార్క్ లిమిటెడ్ (రామ్కీ) సీఎస్ఆర్ గ్రాంట్ కింద ఆర్థిక సహకారం

శుక్రవారం ఉదయం పరవాడలోని క్రీడా వికాస కేంద్రం వద్ద ఉన్న క్రికెట్ స్టేడియం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, వాలీబాల్ కోర్టును జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రికెట్ క్రీడాభివృద్ధి, క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా క్రికెట్ స్టేడియంలో పొదలు తొలగించడం, భూమిని చదును చేయడం, గ్రౌండ్‌లో కంకర నింపి పిచ్‌లను ఏర్పాటు చేయడం వంటి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి మె. విశాఖ పార్క్ లిమిటెడ్ (రామ్కీ) వారి మేనేజింగ్ డైరెక్టర్ సీఎస్ఆర్ గ్రాంట్ కింద ఆర్థిక సహకారం అందించినట్లు ఆమె పేర్కొన్నారు.

ఈ క్రికెట్ గ్రౌండ్‌కు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.