ప్రస్తుత నైరుతి రుతుపవన కాలంలో అనకాపల్లి జిల్లాలో 54.85 శాతం లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో జిల్లాలోని నీటి వనరుల పరిస్థితిపై జల వనరుల శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఇరిగేషన్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో ప్రధాన, మధ్యతరహా రిజర్వాయర్లు, చిన్నతరహా నీటిపారుదల వనరుల్లోకి నీటి ప్రవాహాలు గణనీయంగా తగ్గినట్టు ఇరిగేషన్ అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. దీనిపై కలెక్టర్ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించారు.

అనకాపల్లి జిల్లాలో ఒక ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టు, మూడు మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు, 2,880 చిన్నతరహా నీటిపారుదల వనరులు (చెరువులు, ఆనికట్లు, గ్రోయిన్లు, చెక్‌డ్యామ్‌లు) ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా తాండవ, శారద, వరాహ నదులు ప్రవహిస్తున్నాయి.

తాండవ జలాశయంలో 48.77 శాతం నిల్వ

ప్రధాన ప్రాజెక్టు అయిన శ్రీ రాజా సాగి సూర్యనారాయణ రాజు తాండవ జలాశయం మొత్తం స్థూల నిల్వ సామర్థ్యం 4,960 మిలియన్ క్యూబిక్ ఫీట్లు (Mcft) కాగా, ప్రస్తుత వినియోగించదగిన నీటి నిల్వ 2,146 Mcft, ఇది మొత్తం లైవ్ స్టోరేజ్‌లో 48.77 శాతం. దీని ఆయకట్టు 51,465 ఎకరాలు (అనకాపల్లి: 32,689, కాకినాడ: 18,776), ఖరీఫ్ 2026కు నీటిని ఆగస్టు 11న విడుదల చేయగా, ఇప్పటివరకు 10,500 ఎకరాల్లో నాట్లు వేశారు.

మధ్యతరహా ప్రాజెక్టుల్లో శ్రీ వరద నారాయణమూర్తి రైవాడ జలాశయంలో లైవ్ స్టోరేజ్ 18.59 శాతం (609 Mcft) ఉండగా, జీవీఎంసీ తాగునీటి అవసరాలకు 50 క్యూసెక్కుల చొప్పున 1.582 టీఎంసీ నీరు అవసరం. శ్రీ వెచ్చలపు పాలవెల్లి కోనాం జలాశయంలో 13.92 శాతం (116 Mcft), శ్రీ తెన్నేటి విశ్వనాధం పెద్దేరు జలాశయంలో కేవలం 6.32 శాతం (20.25 Mcft) నిల్వ మాత్రమే ఉంది. శ్రీ గుడివాడ గురునాథరావు వరాహ జలాశయంలో 25.06 శాతం (108 Mcft) నిల్వ నమోదైంది.

వారాబందీ విధానంలో రొటేషనల్ సరఫరా

ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని, తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, సురక్షితంగా అందించగల వాస్తవిక సాగునీటి సామర్థ్యం, జలాశయాల నీటి విడుదల షెడ్యూల్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నీటి నియంత్రణ చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో వారాబందీ (Warabandi) విధానంలో రొటేషనల్ నీటి సరఫరా అమలు చేస్తూ, అందుబాటులో ఉన్న నీటిని రైతులందరికీ సమానంగా, న్యాయబద్ధంగా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.