వృద్ధులకు చేదోడుగా, నిరుపేదలకు ఆసరాగా నిలిచేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 'ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం' కింద నూతన పింఛను దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, మంజూరు ప్రక్రియకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసినట్టు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలు లభిస్తాయని, SGSW అలాగే ఎన్టీఆర్ భరోసా పింఛను వెబ్‌సైట్ల నుంచి కూడా దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆమె వివరించారు. లబ్ధిదారులు పూర్తి చేసిన దరఖాస్తును అవసరమైన ధృవీకరణ పత్రాలతో సంబంధిత స్వర్ణ గ్రామ/వార్డు కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. డిజిటల్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వివరాలను పోర్టల్‌లో నమోదు చేసి దరఖాస్తుదారులకు రశీదు అందజేస్తారని, నమోదు సమయంలో సిస్టమ్ ద్వారా ఈకేవైసీ సరిపోలిక, సాధారణ అర్హతల పరిశీలన జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

క్షేత్రస్థాయి పరిశీలన, ఆమోద ప్రక్రియ

ప్రాథమిక అర్హత పొందిన దరఖాస్తులపై వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (డబ్ల్యూఈఏ)/వార్డు వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సెక్రటరీ (డబ్ల్యూడబ్ల్యూడీఎస్), స్వర్ణ గ్రామ/వార్డు సిబ్బంది లబ్ధిదారు నివాసానికి వెళ్లి ప్రత్యక్ష పరిశీలన చేపడతారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల దరఖాస్తులను ఎంపీడీవో/మునిసిపల్ కమిషనర్ పరిశీలిస్తారని, ఒంటరి మహిళల దరఖాస్తులను తహసీల్దార్ పరిశీలిస్తారని కలెక్టర్ తెలిపారు. చేనేత, మత్స్యకార, డప్పు కళాకారులు, సాంప్రదాయ చర్మకారులు, కల్లు గీత కార్మికులు, ట్రాన్స్‌జెండర్ల దరఖాస్తులను సంబంధిత జిల్లా స్థాయి అధికారులు పరిశీలించి ఎంపీడీవో/మునిసిపల్ కమిషనర్‌కు పంపుతారు. వారి సిఫార్సు మేరకు రాష్ట్ర స్థాయిలో సెర్ప్ (SERP), ఆర్టీజీఎస్, సంబంధిత శాఖలు తనిఖీ చేసి బడ్జెట్ కేటాయింపు ఆధారంగా మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తాయని ఆమె వివరించారు.

నిర్దేశిత కాలపట్టిక

సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు (7 పనిదినాల్లో) దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, ఈకేవైసీ, సాధారణ అర్హతల పరిశీలన జరుగుతుంది. సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు (5 పనిదినాల్లో) క్షేత్రస్థాయి భౌతిక పరిశీలన, శాఖాపరమైన తనిఖీలు చేపడతారు. సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు (3 పనిదినాల్లో) అధికారుల ద్వారా స్క్రూటినీ, అర్హతల నిర్ణయం, సిఫార్సు ప్రక్రియ సాగుతుంది. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో (2 పనిదినాల్లో) సెర్ప్ ద్వారా బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోదం లభిస్తుంది.

అవసరమైన ధృవీకరణ పత్రాలు

ఆధార్ కార్డ్, రైస్ కార్డ్ లేదా ఆదాయ ధృవీకరణ పత్రంతో పాటు వర్గాల వారీగా నిర్దేశిత ధృవీకరణ పత్రాలు జతపరచాలి. వృద్ధాప్య పింఛను కోసం వయస్సు ధృవీకరణకు ఆధార్ కార్డ్, వితంతు పింఛను కోసం భర్త మరణ ధృవీకరణ పత్రం, భర్త ఆధార్ సంఖ్య అవసరం. ఒంటరి మహిళలు వివాహితులైతే కోర్టు/అదాలత్ విడాకుల తీర్పు ప్రతి, అవివాహితులైతే తహసీల్దార్ జారీ చేసే నాన్-మ్యారేజ్ సర్టిఫికెట్ జత చేయాలి. దివ్యాంగులైతే 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం తెలిపే సదరమ్ (SADAREM) సర్టిఫికెట్ కలిగి ఉండాలి. చేనేత, మత్స్యకార, డప్పు కళాకారులు, సాంప్రదాయ చర్మకారులు, కల్లు గీత కార్మికులు, ట్రాన్స్‌జెండర్లు సంబంధిత ప్రభుత్వ శాఖలు లేదా జిల్లా మెడికల్ బోర్డు జారీ చేసిన ధృవీకరణ పత్రం సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.

దరఖాస్తు చేసిన తేదీ నుంచి ఎలాంటి పింఛను బకాయిలు రావని, సెర్ప్ పింఛను మంజూరు చేసి అమలు చేసిన నెల నుంచే చెల్లింపులు ప్రారంభమవుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. "పెన్షన్ ఇప్పిస్తాం" అంటూ డబ్బులు అడిగే వారిని నమ్మవద్దని, అనధికార వ్యక్తులకు డబ్బులు చెల్లించకుండా కేవలం అధికారిక ప్రక్రియ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు.