అచ్యుతాపురంలో రూ.77.29 కోట్లతో 220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ ప్రారంభం
అనకాపల్లి, అక్టోబర్ 5 (ఎక్స్‌ప్రెస్ టుడే): జిల్లాలో పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురం ప్రాంతంలో విద్యుత్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రూ.77.29 కోట్ల వ్యయంతో ఏపీ ట్రాన్స్‌కో నిర్మించిన 220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ను సోమవారం ఉదయం ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అచ్యుతాపురం ప్రాంతంలో పెరుగుతున్న గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సబ్‌స్టేషన్‌ను నిర్మించినట్లు తెలిపారు. దీని ద్వారా వినియోగదారులకు మరింత నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. భవిష్యత్ పారిశ్రామిక అవసరాలను ముందుగానే అంచనా వేసి విద్యుత్ మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
పారిశ్రామిక అవసరాల కోసం విద్యుత్ శాఖ సుమారు రూ.1,816 కోట్ల మేర వ్యయం చేస్తోందని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈ ప్రాంతంలో మరో మూడు సబ్‌స్టేషన్లను నిర్మిస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్ లైన్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
అచ్యుతాపురం 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి గుర్తుచేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) నిధులను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. గత ప్రభుత్వం ఒక్క సబ్‌స్టేషన్‌ను కూడా పూర్తిచేయకుండా పలు సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులను అర్ధాంతరంగా నిలిపివేసిందని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి సూచనల మేరకు విద్యుత్ రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి తెలిపారు. బలమైన విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోందని పేర్కొన్నారు.
లైన్‌మెన్ పోస్టుల భర్తీపై త్వరలో నిర్ణయం
క్షేత్రస్థాయి పర్యటనల్లో భాగంగా విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌ల కొరత తమ దృష్టికి వచ్చిందని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఇప్పటికే ఏఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసి 629 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. లైన్‌మెన్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
