ఈ రోజు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో శాప్ చైర్మన్ రవి నాయుడు అధ్యక్షతన అమరావతి ఛాంపియన్షిప్–2026 ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రవాణా, క్రీడా శాఖ మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ, అమరావతి ఛాంపియన్షిప్–2026లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,07,498 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. జిల్లాస్థాయిలో సుమారు 90 వేల మంది, రాష్ట్రస్థాయిలో సుమారు 10 వేల మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారని వెల్లడించారు. ఈ పోటీలను అండర్–17, అండర్–23 విభాగాల్లో నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువ క్రీడాకారులు పాల్గొనడం ద్వారా క్రీడల పట్ల యువతలో ఆసక్తి మరింత పెరుగుతోందని పేర్కొన్నారు.
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రతిభ కనబరిచి పతకాలు సాధించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన 264 మంది క్రీడాకారులకు క్రీడా ప్రోత్సాహకాల కింద మొత్తం రూ.8.8 కోట్ల నగదు ప్రోత్సాహకాలను అందజేసినట్లు తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ప్రతిభ కలిగిన క్రీడాకారులకు అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. అదేవిధంగా, అమరావతి ఛాంపియన్షిప్–2026లో విజయం సాధించిన విజేతలు, రన్నరప్‌లకు కలిపి రూ.92 లక్షల ప్రైజ్‌మనీని అందజేశారు. విజేతలను అభినందిస్తూ, భవిష్యత్తులో వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
తిరుపతిని రాష్ట్రంలోనే ప్రముఖ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, శాప్ సమన్వయంతో మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు రవి నాయుడు తెలిపారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, ఆధునిక మౌలిక వసతులు, అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, యువ క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించడమే అమరావతి ఛాంపియన్షిప్ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
అమరావతి ఛాంపియన్షిప్–2026కు లభించిన ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగానికి గర్వకారణమని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో క్రీడాకారుల భాగస్వామ్యంతో విజయవంతంగా ముగిసిన ఈ ఛాంపియన్షిప్ రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధికి కొత్త ఊపునిచ్చిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ IAS, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు IPS, ఎస్వీ యూనివర్సిటీ మరియు పద్మావతి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్లు, రిజిస్ట్రార్లు, తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి జేబీ శ్రీనివాసులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, శాప్ ఎండి భరణి IFS, పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు.
